షాద్ నగర్ కు సీఎం కేసీఆర్ వరాలు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారు. 92 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున, 86 మధిర గ్రామాలకు, 127 తండాలకు 5 లక్షల చొప్పున అభివృద్ధి నిధులు ఇస్తామన్నారు. ఈ నిధుల మంజూరుకు సోమవారం సాయంత్రానికి ఆర్డర్ కాపీ ఇస్తామని చెప్పారు. మంత్రి కేటీఆర్ త్వరలోనే షాద్ నగర్ మున్సిపాలిటీని సందర్శించి, అభివృద్ధికి ఏం చేయాలో చర్చిస్తారని, అవసరమైన నిధులు మంజూరు చేస్తారని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

పాలమూరు లిఫ్ట్ తో షాద్ నగర్ నియోజకవర్గం మొత్తం సాగునీరు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. పాలమూరు లిఫ్ట్ తో రెండేళ్లలో 20 లక్షల ఎకరాలు సాగు చేయబోతున్నామని తెలిపారు. ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా పాలమూరు పచ్చబడాలనేది మన ప్రతిజ్ఞ అన్నారు. రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన (670 మీటర్ల ఎత్తు) కొందుర్గు మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో రిజర్వాయర్ ఏర్పాటు చేసి గ్రావిటీ ద్వారా తాగు, సాగునీళ్లు సరఫరా చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సలీం, షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.