శాసనమండలి రేపటికి వాయిదా

రాష్ట్ర శాసనమండలి రేపటికి వాయిదా పడింది. ఉదయం సభ ప్రారంభమైన తర్వాత చైర్మన్ స్వామిగౌడ్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పారు. ఆ తర్వాత అసెంబ్లీలో ఆమోదం పొందిన తెలంగాణ భూ హక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాల చట్టం సవరణ బిల్లుని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, తెలంగాణ గేమింగ్ యాక్ట్ సవరణ బిల్లుని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మండలిలో ప్రవేశపెట్టారు. వాటిని సభ ఆమోదించింది. టీ విరామం తర్వాత పోలీస్ వ్యవస్థ ఆధునీకరణపై లఘు చర్చను చైర్మన్ ప్రారంభించారు. ఈ అంశంపై తీసుకున్న చర్యలను  హోంమంత్రి నాయిని సభకు వివరించారు. ఈ అంశంపై చర్చ తర్వాత సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్ ప్రకటించారు.