శశికళ వ్యాపార సామ్రాజ్యానికి ఐటీ షాక్

తమిళనాడులోని శశికళ వ్యాపార సామ్రాజ్యానికి ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు షాకిచ్చారు. ఉదయం జయటీవీ, డాక్టర్ నమధు ఎంజీఆర్ దినపత్రిక సహా… అన్నాడీఎంకేలోని శశికళ వర్గానికి చెందిన అసమ్మతి నేతల నివాసాల్లో అధికారులు మూకుమ్మడి సోదాలు చేపట్టారు. పన్నులు ఎగ్గొట్టినట్టు ఆరోపణలు రావడం వల్లే సోదాలు జరుపుతున్నట్టు ఐటీ అధికారులు పేర్కొన్నారు. జయ ప్లస్‌ చానెల్ జాబితాలోని దాదాపు 16 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. వీటితో పాటు శశికళ కుటుంబం చేతుల్లో ఉన్న మన్నార్‌గుడి, తంజావూర్‌లలోని పలువురి నివాసాలలో అధికారులు అకస్మిక సోదాలు నిర్వహించారు. టీటీవీ దినకరన్, దివాకరన్, సుందరవదనం తదితరులతో పాటు శశికళ కుటుంబంలోని సన్నిహితులందరి ఇళ్లలో ఐటీ దాడులు జరిగాయి. బెంగళూరులోని అన్నాడీఎంకే కర్నాటక రాష్ట్ర కార్యదర్శి ఇంటిని కూడా వదల్లేదు.

జయ టీవీ కార్యాలయంపై ఆదాయ శాఖ అధికారుల దాడులను ఖండించారు టీటీవీ దినకరన్. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. దాడులతో తమను భయపెట్టాలని కేంద్రం పగటి కలలు కంటున్నదన్నారు. 20 ఏళ్లు శశికళను జైల్లో పెట్టినా… ఆ తర్వాత ఆమె రాజకీయాల్లో రాణిస్తారని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వారికి త్వరలోనే బుద్ధి చెబుతారన్నారు దినకరన్.

తమిళనాడులో పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు ఒక్కటైన తర్వాత శశికళ వర్గం వీరిపై తీవ్ర విమర్శలు చేస్తోంది. శశికళ ఆధ్వర్యంలో ఉన్న జయ టీవీలో పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐటీ దాడులు జరగటంతో ఇది కక్ష సాధింపు చర్యలేనని ఆరోపణలు వస్తున్నాయి.