శశికళ అండ్ కో ఎగ్గొట్టిన ఐటి రూ.1500 కోట్లు!

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ, ఆమె కుటుంబీకుల ఇళ్లలో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో భారీ ఎత్తున అక్రమ ఆదాయాన్ని కనుగొన్నారు. మూడు రోజుల పాటు జయ టీవీ సహా శశికళ కుటుంబీకులు, బంధువుల ఇళ్లపై జరిపిన దాడుల్లో దాదాపు 15 వందల కోట్ల రూపాయలు పన్ను ఎగవేసినట్లు గుర్తించారు. పెద్ద మొత్తంలో  పన్ను ఎగవేసినట్టు కచ్చితమైన సమాచారం ఉండటంతో ఐటీ అధికారులు 187 చోట్ల సోదాలు జరిపారు. ఈ దాడుల్లో ఊహించని స్థాయిలో అక్రమ సంపాదన ఉన్నట్లు గుర్తించారు. 15 వందల కోట్ల రూపాయల పన్ను ఎగ్గొట్టారంటే… వారి సంపద అంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పలు పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే జయ టీవీ ఎండీ సహా పలువురిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. అటు శశికళ మేనల్లుడు దినకరన్ మాత్రం ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగానే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.