శరవేగంగా కాళేశ్వరం ప్రారజెక్టు పనులు  

 

కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏర్పడిన అడ్డంకులన్నీ ఒక్కొక్కటిగా తొలిగిపోతున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులపై స్టే విధిస్తూ ఢిల్లీలోని జాతీయ హరిత ట్రిబ్యునల్  ప్రధాన బెంచ్ జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణం మరింత వేగంగా ముందుకు సాగే అవకాశం ఏర్పడింది. రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా చేపడుతున్న చర్యలకు అడ్డంకి కలిగించేలా ఉన్న ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులను రద్దుచేస్తున్నట్లు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ , జస్టిస్ జే ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ప్రధానంగా ప్రజల తాగునీటి అవసరాల కోసం చేపడుతున్న భారీ ప్రాజెక్టు పనులను ఆపివేస్తూ ఎన్జీటీ ఉత్తర్వులు ఇవ్వడం అర్థరహితమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర అటవీశాఖ ఇప్పటికే స్టేజ్ -1 అనుమతులు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించింది. తుది అనుమతులు వచ్చేవరకు అటవీశాఖకు చెందిన భూముల్లో పనులు చేపట్టబోమని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇస్తున్నప్పటికీ పనుల నిలిపివేతకు ఆదేశించడం భావ్యం కాదని పేర్కొంది. అన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకొని తిరిగి విచారణ చేపట్టాలని ఢిల్లీ ఎన్జీటీకి స్పష్టం చేసింది. కేసును తిరిగి ఎన్జీటీకి పంపిస్తున్నట్లు తెలిపింది. మరోసారి విచారణ చేపట్టి ఉత్తర్వులు జారీచేసేవరకు కాళేశ్వరం ప్రాజెక్ట్టులో తాగునీటి అవసరాలకు సంబంధించిన పనులను కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇస్తున్నట్లు హైకోర్టు వివరించింది.

రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టుపనులు జరుగుతున్నాయని అడ్వకేట్ జనరల్ ప్రకాశ్‌రెడ్డి ఇచ్చిన హామీని పరిగణనలోనికి తీసుకొని ఆయా పనులను కొనసాగించడానికి అనుమతిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. అయితే ప్రభుత్వానికి కొన్ని షరతులను విధించింది. పర్యావరణ అనుమతులు వచ్చేవరకు సాగునీటికి సంబంధించిన ప్రాజెక్టు పనులను చేపట్టవద్దని స్పష్టం చేసింది. అటవీశాఖ అనుమతులు వచ్చేవరకు అటవీ భూముల జోలికి వెళ్లవద్దని, రిజర్వ్‌ ఫారెస్ట్‌ లోని చెట్లను కొట్టివేయవద్దని, రాళ్లను తొలిగించడానికి పేలుళ్లు జరుపవద్దని ప్రభుత్వానికి సూచించింది. ఈ షరతుల ఉల్లంఘన జరిగితే ఎన్జీటీకి లేదా తమ దృష్టికి తీసుకరావచ్చునని ఫిర్యాదుదారుడు హయతుద్దీన్‌కు హైకోర్టు తెలిపింది. కాళేశ్వరంప్రాజెక్టు పనులపై హైదరాబాద్‌కు చెందిన హయతుద్దీన్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఏకపక్ష విచారణ జరిపిన ఢిల్లీ ఎన్జీటీ పనులను నిలిపివేస్తూ గత నెల ఐదో తేదీన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలుచేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదలశాఖ అధికారులు ఉమ్మడి హైకోర్టులో గత నెల 13న పిటిషన్ దాఖలుచేశారు. తెలంగాణవాదనలు వినకుండా, కారణాలు తెలియజేయకుండా పనులు నిలిపివేయడాన్ని ప్రశ్నించారు. తగిన సాంకేతిక ఆధారాలను చూపుతూ ఎన్జీటీ ఉత్తర్వులను రద్దుచేయాలని కోరారు. ఈ వ్యాజ్యాలపై అక్టోబర్‌లో విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.

అటు ఎన్జీటీ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఎన్జీటీ ఉత్తర్వులపై హైకోర్టులో రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణా అర్హత లేదంటూ ఫిర్యాదుదారుని తరఫు న్యాయవాదిచేసిన వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఒక అంశంపై నిర్ణీత గడువులోగా దాఖలైన ఫిర్యాదులను మాత్రమే విచారించే అధికారం ఎన్జీటీకి ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది. ఈ ప్రాజెక్టు పనులు మొదలై చాలాకాలమైన తరువాత దాఖలైన ఫిర్యాదుపై ఉత్తర్వులు జారీచేయడంలో ఎన్జీటీ తన రూల్స్‌ ను విస్మరించిందని పేర్కొంది. అంతేకాకుండా గతనెల ఐదోతేదీన విచారణలో పాల్గొని ఆదేశాలు జారీచేసిన తరువాత ఎన్జీటీ బెంచ్‌లోని నిపుణుడైన సభ్యుడు ఎనిమిదో తేదీన పదవీ విరమణచేసిన విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది. పదవీ విరమణ తర్వాతనే రీజన్డ్ ఆర్డర్‌పై సంతకం చేసిన సంకేతాలు ఉన్నాయని పేర్కొంది. అయితే ఈ విషయంలో మరింత లోతుకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆసక్తి చూపనందువల్ల తామూ విచారణకు ఆదేశాలు ఇవ్వడం లేదని పేర్కొంది. ప్రాజెక్టు నిర్మాణపనులే తమకు ముఖ్యమని ప్రభుత్వం పేర్కొంటున్న విషయాన్ని హైకోర్టు గుర్తుచేసింది. అంతేకాకుండా దక్షిణాదిరాష్ర్టాల పరిధిలోని అంశంపై చెన్నైలోని ఎన్జీటీ బెంచ్ ఉండగానే.. తెలంగాణ అభ్యంతరాలను పట్టించుకోకుండా ఢిల్లీ ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడం తగదని హైకోర్టు పేర్కొంది.

మొత్తానికి ప్రతిపక్షాల కుట్రలన్నీ పటాపంచలైపోతున్నాయి. కొన్ని రోజులుగా ప్రాజెక్టులకు వరుసగా సానుకూల పరిణామాలు జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అటవీ భూముల బదలాయింపునకు అనుమతినిస్తూ కేంద్ర అటవీ మంత్రిత్వశాఖ మొదటి దశ క్లియరెన్స్ ఇచ్చింది. తర్వాత కేంద్ర జల సంఘం నుంచి కీలకమైన హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం రీడిజైనింగ్‌లో భాగంగా అంచనా వేసిన నీటి లభ్యతను అధికారికంగా ధ్రువీకరిస్తూ సీడబ్ల్యూసీ హైడ్రాలజీ డైరెక్టరేట్ అనుమతి ఇచ్చింది. తర్వాత కొన్ని రోజులకే కేంద్ర జల సంఘంలోని అంతర్రాష్ట్ర అంశాలను పరిశీలించే డైరెక్టరేట్ కూడా తెలంగాణ-మహారాష్ట్ర అంతర్రాష్ట్ర ఒప్పందాలపై ఎలాంటి అభ్యంతరాలు, అనుమానాలు లేవంటూ ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో తాజాగా పనుల కొనసాగింపునకు హైకోర్టు నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో రాష్ట్ర నీటిపారుదలశాఖ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.