విజయవంతంగా భూ రికార్డుల ప్రక్షాళన

గ్రామాల్లో విజయవంతంగా భూ రికార్డుల ప్రక్షాళన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. పట్టణాల్లోనూ ఈకార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది.  గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన పూర్తికాగానే అర్బన్‌ ప్రాంతాల్లో కూడా రికార్డుల ప్రక్షాళన ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించడంతో అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పట్టణాల్లో ఏ విధంగా రికార్డుల ప్రక్షాళన చేయాలన్న దానిపై అధికారులు షెడ్యూల్‌ రూపొందిస్తున్నట్టు సమాచారం.

పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఇండ్ల స్థలాలు, ఇండ్లు, అపార్ట్‌ మెంట్లు, పార్కులు, ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ  కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, రోడ్లు, చెరువులు, అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ భూములు, లే అవుట్లు ఉంటాయి. ఖాళీగా ఉన్న ఇండ్ల స్థలాలు, ఖాళీ జాగాలు, వ్యవసాయేతర భూములు , ప్రభుత్వ భూములు.. ఇలా ఖాళీగా ఉన్న వివిధ భూములపై కబ్జాదారుల కండ్లు ఉన్నాయి. ఇలాంటి ఖాళీ స్థలాలకు డూప్లికేట్‌ డాక్యుమెంట్లు సృష్టించి కొందరు  కాజేశారు. సమైక్య రాష్ట్రంలో అడ్డగోలుగా భూ దందాలు జరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో ఇలాంటి దందాలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌లో చెరువులు కూడా మాయమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉన్నవాటిని రక్షించటంతో పాటు, నగరంలో భూవివాదాలు లేకుండా చేయటమే లక్ష్యంగా భూ రికార్డుల ప్రక్షాళన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

గత 80 యేండ్లుగా రికార్డుల ప్రక్షాళన జరగకపోవడంతో కొన్ని భూములపై వివాదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ తో పాటు రాష్ట్రంలోని 64 పట్టణ ప్రాంతాల్లో వివాదాలకు అస్కారం లేని భూ బ్యాంక్‌ ను ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. దీంతో క్రయవిక్రయాలు పెరుగుతాయి. వివిధ కంపెనీలు రాష్ట్రానికి వచ్చి సొంత కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటాయి. మల్టీనేషనల్‌ కంపెనీలకు పట్టణ ప్రాంతాల్లోని భూములు, వాటి రికార్డులపై పూర్తి నమ్మకం కుదరాలంటే రికార్డులు సరిగ్గా ఉండాలి. ఒకరి భూమిని ఇంకొకరు ట్యాంపరింగ్‌ చేసి ఆక్రమించుకోవడానికి ఆస్కారం లేని విధానం రూపొందించాలి. ఈ దిశగా సర్కారు కార్యచరణ మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే అర్బన్‌ ప్రాంతాలలో కూడా రికార్డుల ప్రక్షాళన చేపట్టాలని సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తున్నది. రెవెన్యూ యంత్రాంగం డిసెంబర్‌ 31 కల్లా గ్రామాల్లో భూరికార్డుల ప్రక్షాళన పూర్తి చేయనుంది. తర్వాత స్థానిక అర్బన్‌ బాడీలతో సమన్వయం చేసుకొని పట్టణ ప్రాంతాల్లో రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలుస్తున్నది. అర్బన్‌ ప్రాంతాలలో ముఖ్యంగా సర్వే నెంబర్లలో మార్పులు వచ్చాయి. కొన్ని చోట్ల గ్రామీణ ప్రాంతాలకు చెందిన సర్వే నెంబర్లు ఉన్నాయి. అలాగే టౌన్‌ సర్వే నెంబర్లు ఉన్నాయి. ఇలా రెండు సర్వే నెంబర్లు ఉన్న  ప్రాంతాల్లో ఏ విధంగా రికార్డులు పరిశీలించాలన్న అంశంపై అధికారులు దృష్టి సారించారు.

ఇక హైదరాబాద్‌ లో ఎక్కువగా అపార్ట్‌ మెంట్ కల్చర్‌ ఉన్నది. చాలా మంది అపార్ట్‌ మెంట్‌ లలో ప్లాట్లు కొనుక్కొని ఉంటున్నారు. ప్లాట్లు రిజిస్టర్‌ అయిన తరువాత మున్సిపాలిటీలో మ్యుటేషన్‌ చేస్తారు. అపార్ట్‌ మెంట్ల విషయంలో అపార్ట్‌ మెంట్‌ నిర్మించిన భూమి టైటిల్‌, భవన నిర్మాణ అనుమతులు, అగ్రిమెంట్లు పరిశీలిస్తారు. దీనికి ప్రధాణ కారణం.. ఆయా నిర్మాణ సంస్థలు అగ్రిమెంట్ చేసుకొని అపార్ట్‌ మెంట్లు నిర్మించి విక్రయిస్తాయి. ఈ నేపథ్యంలో అపార్ట్‌ మెంట్ల విషయంలో మూడు నాలుగు రకాలుగా పరిశీలించి.. ఆయా రికార్డులకు క్లియరెన్స్‌ ఇస్తారు. ముఖ్యంగా నగరాల్లో ఎన్‌ఆర్‌ ఐలకు చెందిన ఇండ్లు, ఇండ్ల స్థలాలు చాలా ఉన్నాయి. కొంత మంది నకిలీ అగ్రిమెంట్ పేపర్లు సృష్టించి.. వాటిని కబ్జా చేస్తున్నారు. ఇలాంటి వాటికి కూడా చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉన్నదని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలో భూ రికార్డులను పకడ్బందీగా తయారు చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతోంది.