విజయవంతంగా కొనసాగుతున్న భూ రికార్డుల ప్రక్షాళన

రాష్ట్రంలో భూమి రికార్డుల ప్రక్షాళన విజయవంతంగా కొనసాగుతొంది.  రైతుల సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. లెక్క పక్కాగా తేలుతున్నది. ఇప్పటి వరకు 15.64 లక్షల మంది రైతులకు యాజమాన్య హక్కులు కల్పించారు. ఫౌతితో పాటు రికార్డులలో చిన్నచిన్న తప్పులన్నీ సరిచేస్తున్నారు. దీంతో గ్రామాల్లోని రైతులంతా సంతోషంగా ఉన్నారు.

ఇప్పటి వరకు 69,69,664 ఎకరాల భూములకు చెందిన రికార్డులు పరిశీలించిన రెవెన్యూ బృందాలు 60,97,481 ఎకరాల భూములకు క్లియరెన్స్ ఇచ్చాయి. ఇందులో వ్యవసాయ భూమి 53,89,509 ఎకరాలుఉండగా, వ్యవసాయేతర భూమి – ఎడ్ల బీడు, ఏనెకర్ర, వెంచర్లు, గ్రామకంఠాలు ఇలాంటివన్నీ కలిపి 3,78,688 ఎకరాలు, ప్రభుత్వ భూమి – అటవీ భూమి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రోడ్లు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, చెరువులు, వాగులు, వంకలు 3,29,272 ఎకరాలున్నట్టు నిర్ధారించారు. ప్రస్తుతం 3539 గ్రామాల్లో రికార్డుల ప్రక్షాళన పూర్తయింది. మరో వారంలో 2703 గ్రామాలలో ప్రక్షాళన పూర్తి చేయనున్నట్టు అధికారులు తెలిపారు.

నవంబర్ 15 నాటికి మొత్తంగా ఆరువేలకుపైగా గ్రామాలలో రికార్డుల ప్రక్షాళన పూర్తి కానున్నది. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో వస్తున్న సమస్యలన్నీ అక్కడికక్కడే పరిష్కరించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయి. ముఖ్యంగా న్యాయపరమైన చిక్కులున్నవి తప్పిస్తే మిగిలినవన్నీ పరిష్కరించాలని స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. 90% పైచిలుకు భూమి సమస్యలు రికార్డుల ప్రక్షాళనలో పూర్తిచేయాలని అధికారులను సీఎం కేసీఆర్  ఆదేశించారు. దీంతో అసైన్డ్, సీలింగ్, భూదాన్ భూములకు సంబంధించిన సమస్యలు గుర్తించారు. వీటికి యజమాన్యహక్కులు కల్పించాలని ప్రస్తుతం ఈ భూములను సాగు చేసుకుంటున్న రైతులు అధికారులను కోరుతున్నట్టు తెలిసింది. చాలా గ్రామాలలో ఒకేతీరుగా ఉన్న ఈ సమస్యలు చాలా ఎక్కువస్థాయిలో రావడంతో అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. రికార్డుల ప్రక్షాళనలో ప్రధాన సమస్యల పరిష్కారం కోసం.. సమాలోచనలు జరిపిన సర్కారు అసైన్డ్  భూముల సమస్య పరిష్కారానికి క్యాబినెట్  సబ్‌  కమిటీని వేసింది. ఈ సబ్‌ కమిటీ కూడా వేగంగా సమస్యకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నది.