వచ్చే నెల 3న బీసీ ప్రజా ప్రతినిధులతో సమావేశం

రాష్ట్రంలోని బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో డిసెంబర్ 3న అసెంబ్లీ కమిటీ హాలులోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బీసీలు, ఎంబీసీల అభివృద్ధిపై సభ్యుల అడిగిన ప్రశ్నలపై ఆయన స్పందించారు. మన రాష్ట్రంలో ఉండే అత్యధిక జనాభా బీసీలే అని తెలిపారు. 50 శాతానికి పైబడి ఉన్న బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎం చెప్పారు. ప్రభుత్వానికి బీసీల సంక్షేమానికి మించిన ప్రాధాన్యత వేరొకటి ఉండదని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల కన్నా బీసీలలో కడు పేదరికంలో ఉన్న వారున్నారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. వారి స్థితిగతులపై అధ్యయనానికి వేసిన బీసీ కమిషన్ త్వరలో ఇవ్వబోయే సర్వసమగ్ర వివరాలతో వచ్చే నెల 3న సమావేశం నిర్వహిస్తామన్నారు. ఆ రోజున బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం చేయాలనుకున్న కార్యక్రమాలు ఏంటి? ఎటువంటి కార్యక్రమాలు అమలు చేయాలి? ఇప్పటి వరకు వారి సంక్షేమం కోసం ఖర్చు చేసింది ఎంత? అనే అంశాలపై సమగ్రంగా మాట్లాడుకుందామని చెప్పారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో బంగారు తెలంగాణకు బాటలు వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు అవసరం లేదని, ఎంబీసీల సంక్షేమం కోసం అమూల్యమైన సూచనలు ఇస్తే అమలు చేస్తామని సభ్యులకు సీఎం కేసీఆర్ సూచించారు.