వచ్చే నెల 10న సాగర్ ఎడమ కాలువకు నీళ్లు

డిసెంబర్ 10 న యాసంగికి సాగునీటిని సాగర్ నుంచి విడుదల చేసేందుకు ఉన్నత స్థాయి సమావేశంలో స్థూలంగా నిర్ణయించారు. ఈ మేరకు ఖమ్మం, నల్లగొండ జిల్లాల ప్రజాప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. అయితే, శనివారం (రేపు) మిర్యాలగూడలో ఆయకట్టు రైతులు, ఆయకట్టు పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులతో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో జరగనున్న కీలక సమావేశంలో యాసంగి నీటి విడుదల కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయనున్నట్టు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.

యాసంగికి నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై మంత్రులు హరీశ్ రావు, తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అసెంబ్లీ కమిటీ హాలులో సమీక్షించారు. గత యేడాది యాసంగిలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి 36 టీఎంసీలను సాగునీటికి వాడినట్టు మంత్రి హరీశ్ తెలిపారు. ఈసారి 40 టీఎంసీలు  యాసంగికి లభ్యత ఉన్నట్టు చెప్పారు. సాగునీటి నిర్వహణలో తీసుకున్న అనేక జాగ్రత్తల వల్ల, ఆన్ అండ్ ఆఫ్ విధానంలో నీటి సరఫరా చేసినందున ఒక టీఎంసీకి 10,639 ఎకరాల ను సాగులోకి తీసుకు రాగలిగినట్టు హరీశ్ రావు వివరించారు.

2012-13 యాసంగిలో 34.05 టీఎంసీల ద్వారా 2.58 లక్షల ఎకరాలు, 2013-14లో 72.09  టీఎంసీల ద్వారా 4.37 లక్షల ఎకరాలు, 2014-15లో 51.04 టీఎంసీల ద్వారా 2.76 లక్షల ఎకరాలు, 2016-17 లో 36 టీఎంసీల నీటిని సరఫరా చేసి 3.83 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించినట్టు ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఈసారి 40 టీఎంసీలను యాసంగికి విడుదల చేస్తున్నందున 4.50 లక్షల ఎకరాలకు పైగా సాగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్పారు. సాగర్ ఎడమ కాలువ కింద మిగతా రెండు లక్షల ఎకరాల పరిధిలో ఆరుతడి పంటలను ప్రోత్సాహించాలన్నారు. చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందనపుడు వరి పంట వేస్తే రైతులు ఇబ్బందులు పడవచ్చునని, ముందుగానే పరిస్థితిని రైతులకు తెలియజేయాలని, వారిలో అవగాహన తీసుకు రావాలని మంత్రి హరీశ్ రావు కోరారు.

యాసంగి సాగునీటి విడుదల యాక్షన్ ప్లాన్ ఖరారు అవుతున్నందున ఇరిగేషన్ ఇంజనీర్లు కాలువల వెంట కాలినడకన పర్యటించాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. కాలువల్లో నీటి పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని అన్నారు. ఆన్ అండ్ ఆఫ్ విధానంలో నీటి సరఫరా వల్ల మంచి ఫలితాలు వచ్చినందున దానిని అనుసరించాలని కోరారు.

ఈ సమావేశంలో ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు  పువ్వాడ అజయ్, పద్మావతి, వీరేశం, మల్లు భట్టి విక్రమార్క, రవీంద్ర నాయక్, భాస్కర్ రావు, మదన్ లాల్, ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎస్.కె.జోషి, ఈ.ఎన్. సి. మురళీధరరావు, సాగర్ సి.ఇ. ఎస్.సునీల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.