వచ్చే ఏడాదిలోపు చనాక-కొరాట పూర్తి

చనాక – కోరటా బ్యారేజీని వచ్చే ఏడాదిలోపు పూర్తి చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఈ మేరకు ప్రాజెక్ట్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ ప్రాజెక్టుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా బోథ్, ఆదిలాబాద్ రూరల్ మండలాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చాలెంజ్‌గా తీసుకున్నామని తెలిపారు.

లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టును గత ప్రభుత్వాలు ఓట్ల కోసం వాడుకున్నాయని మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనులు ప్రారంభించి 51 ఏళ్లయినా పూర్తి చేయలేదని విమర్శించారు. వాస్తవానికి మహారాష్ట్ర ఈ ప్రాజెక్ట్ నిర్మించి మనకు కొంతమేరకు నీళ్లివ్వాల్సి ఉందన్నారు. స్వయంగా తానే ఏడుసార్లు మహారాష్ట్రకు వెళ్లి.. ప్రాజెక్టు పనులపై చర్చించి అనుమతులు తీసుకున్నామని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో ఈ ప్రాజెక్టు కోసం అనేకసార్లు పోరాటం చేశామన్న మంత్రి.. ఇప్పుడు తన నేతృత్వంలో ప్రాజెక్టు పనులు కొనసాగుతుండటం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.