వచ్చే అక్టోబర్ 2కల్లా ఓడీఎఫ్ రాష్ట్రంగా తెలంగాణ

గత కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్దల సభ గౌరవాన్ని దిగజార్చిందని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ హయాంలో ఏ ఒక్క మంత్రి కూడా మండలికి వచ్చే వారు కాదని గుర్తుచేశారు. ఆ టైంలో మంత్రులు లేక మండలిని వాయిదా వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక పెద్దల సభ ఔన్నత్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నదని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. గత ప్రభుత్వాలు ప్రశ్నోత్తరాల సమయాన్ని తప్పించుకునేందుకు ప్రయత్నించేవని.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రశ్నోత్తరాల సమయానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు మంత్రి కేటీఆర్‌.

2018 అక్టోబర్ 2 నాటికి 15 లక్షల 92 వేల టాయిలెట్స్ నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అప్పటికల్లా రాష్ట్రాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా రూపొందిస్తామన్నారు. వీటి నిర్మాణానికి 2 వేల 44 కోట్లు నిధులు అవసరమవుతాయన్నారు. ఇప్పటి వరకు నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, మేడ్చల్ జిల్లాలు పూర్తి ఓడీఎఫ్ నగరాలుగా గుర్తించినట్లు వెల్లడించారు.