వక్ఫ్ ఆస్తుల రక్షణకు పటిష్ట చర్యలు

వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు తెలంగాణ వక్ఫ్ బోర్డు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని సీఎం కేసీఆర్‌ చెప్పారు. కేంద్ర వక్ఫ్‌ చట్టానికి అనుగుణంగా తెలంగాణ వక్ఫ్‌ యాక్టును కొత్తగా రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని వక్ఫ్‌ ఆస్తులన్నింటినీ వెంటనే గుర్తించి, వాటిని రక్షించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. వక్ఫ్‌ భూములకు ప్రహరీ లేదా కంచె నిర్మించాలని, వాటిని జిల్లా కలెక్టర్‌ల స్వాధీనంలో ఉంచాలని సూచించారు. వక్ఫ్‌ బోర్డు సభ్యులతో హైదరాబాద్ లోని ప్రగతి భవన్‌లో సమావేశమైన సీఎం కేసీఆర్ పలు అంశాలపై చర్చించారు.

తెలంగాణలో వక్ఫ్ ఆస్తులు ఎక్కడున్నాయి? ఎలా ఉన్నాయనే వివరాలు వెంటనే సేకరించాలని సీఎం కేసీఆర్ కోరారు. కబ్జాలకు గురైన వక్ఫ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అవలంభించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని చెప్పారు. రెవిన్యూ శాఖకు, వక్ఫ్ బోర్డుకు మధ్య వివాదం ఉన్నట్లైతే.. వెంటనే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. భూమి కానీ ఏదైనా ఆస్తికానీ ఒకసారి వక్ఫ్ ఆస్తిగా నిర్థారణ జరిగితే అది ఎప్పటికైనా వక్ఫ్ ఆస్తిగానే ఉంటుందని స్పష్టం చేశారు. వక్ఫ్ ఆస్తుల రక్షణకు రెండు కమిటీలు వేయాలన్నారు. ఒక కమిటీ రికార్డుల నిర్వహణను పర్యవేక్షించాలన్నారు.  మరో కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి ఆస్తులను గుర్తించి, రక్షించే చర్యలు పర్యవేక్షించాలని చెప్పారు. వక్ఫ్‌ భూముల రక్షణ విషయంలో పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్లను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

వక్ఫ్ బోర్డు పనితీరు ఎలా ఉండాలి? వక్ఫ్ బోర్డు విధి విధానాలు ఎలా ఉండాలనే విషయంపై కూడా స్పష్టత రావాలని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. త్వరలోనే వక్ఫ్ బోర్డు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకుని భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయాలని సూచించారు.

వక్ఫ్ బోర్డు ఛైర్మన్ సలీం, సీఈవో మన్నన్‌, సభ్యులు మౌజం ఖాన్‌, అక్బర్ నిజాముద్దీన్, సయ్యద్ జకీరుద్దీన్‌, అనుషద్, ఇక్బాల్‌, అన్వర్‌, నిసాన్ అహ్మద్‌, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్‌, మైనారిటీ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్‌, సీఎంఓ కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.