లక్ష ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతం

తెలంగాణలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హామీని నెరవేర్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు చేపడుతున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు మంత్రులు కె.టి. రామారావు, లక్ష్మారెడ్డిలు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణితో సచివాలయంలో సమావేశం అయ్యారు. నిన్న హైదరాబాద్ లోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో విద్యార్థులతో మాట్లాడిన సందర్భంగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపినట్లు మంత్రి కె.టి. రామారావు చెప్పారు. ఈ సందర్భంగా టిఎస్పీఎస్సీ ద్వారా జారీ చేసిన నోటిఫికేషన్లు, భర్తీ ప్రక్రియను మంత్రి తెలుసుకున్నారు.

ఇప్పటిదాకా సుమారు 29,500 ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల చేసినట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. ఇందుకోసం టీఎస్పీఎస్సీ ఇప్పటి వరకు సుమారు 75 నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు చెప్పారు. వీటిలో సుమారు 23,400 ఉద్యోగాలకు పరీక్షలు పూర్తిచేసినట్లు వివరించారు. సుమారు 18 పరీక్షల తాలూకు డాటా ప్రాసెసింగ్ ప్రస్తుతం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సిజిజి) వద్ద కొనసాగుతున్నట్లు తెలిపారు. త్వరలోనే మరిన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు మంత్రులకు చైర్మన్ తెలిపారు. కమిషన్ చేపట్టిన పలు సంస్కరణలు దేశంలోని  పలు రాష్ర్టాల కమిషన్లు ఆదర్శంగా తీసుకుంటున్నాయని చక్రపాణి వివరించారు.

టీఎస్పీఎస్సీతో పాటు పోలీస్, విద్యుత్ మొదలయిన శాఖల ద్వారా లక్ష ఉద్యోగాలు భర్తీ అవుతాయని మంత్రి కె.టి. రామారావు తెలిపారు. టీఎస్పీఎస్సీ పారదర్శకంగా పనిచేస్తోందన్న మంత్రి, కమిషన్ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్, డాటా ప్రాసెసింగ్ వంటి ప్రక్రియలను మరింత వేగంగా పూర్తి చేసేందుకు అవసరం అయిన ఐటి సెంటర్ ఏర్పాటు కోసం భవన సదుపాయాన్ని కల్పిస్తామన్నారు. ఈ మేరకు తమ శాఖ పరిధిలో ఉన్న పలు భవనాలను మంత్రి ఆదేశాల మేరకు అధికారులు కమిషన్ చైర్మన్ కు చూపించారు. త్వరలోనే ఈ ఐటి సెంటర్ పూర్తి చేసేందుకు ఐటి శాఖ పరిధిలోని టీఎస్ టీఎస్ ద్వారా సహకారం అందిస్తామన్నారు.