లక్షా 12 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం

రాష్ట్రంలో లక్షా 12 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఇప్పటికే 25 వేల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిందని, వచ్చే సంవత్సర కాలంలో మిగిలిన 87 వేల ఉద్యోగాలను  భర్తీచేస్తామని చెప్పారు. నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎస్సీ కులాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఏర్పాటు చేసిన స్టడీ సర్కిల్ ను మంత్రి ప్రారంభించారు.

ఉద్యోగాలకు ప్రిపేరయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నదని మంత్రి హరీశ్ రావు చెప్పారు. సిద్దిపేట స్టడీ సెంటర్ కోసం 90 లక్షల రూపాయలు మంజూరు చేసిందని వెల్లడించారు. కోచింగ్ తీసుకునే విద్యార్థులకు ఈ నిధులతో వసతి, భోజనం, స్టడీ మెటీరియల్ అందజేస్తామన్నారు. వేల రూపాయలు వెచ్చించి తల్లిదండ్రులు కోచింగ్ ఇప్పించే పరిస్థితి లేదని, అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా దళిత, గిరిజన, వెనకబడిన తరగతుల విద్యార్థుల కోసం ప్రభుత్వం ద్వారా ఈ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారని మంత్రి తెలిపారు.

ఉన్నత విద్యను చదివేందుకు విదేశాలకు వెళ్ళే దళిత విద్యార్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ 20 లక్షల రూపాయలను గ్రాంట్ గా అందజేస్తున్నారని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం లేదని మంత్రి హరీశ్ రావు చెప్పారు. కోచింగ్ తీసుకునే విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, బ్యాంకింగ్, రైల్వే ఉద్యోగాల్లో అవకాశాలు ఉన్నాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావుతో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.