రోడ్లు తవ్వకుండా డ్రైనేజీల నిర్మాణం

హైదరాబాద్‌ లో సీవరేజీ పైప్‌ లైన్ల మరమ్మతుపై మంత్రి కేటీఆర్‌ దృష్టి సారించారు. దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన వాటి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారు. జలమండలి ఆధ్వర్యంలో పనులను చేపడుతున్నారు. సీవరేజీ పైపులైన్ల మరమ్మతు కోసం ద‌క్షిణ భారతంలోనే తొలిసారిగా క్యూర్డ్ ఇన్ ప్లేస్ పైప్ టెక్నాల‌జీని వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ గార్డెన్స్‌ దగ్గర సీఐపీపీ టెక్నాలజీ ద్వారా చేపట్టిన ప‌నుల‌ను మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. జల‌మండ‌లి ఎండీ దాన‌కిషోర్‌తో పాటు పలువురు అధికారులు మంత్రి వెంట ఉన్నారు.

హైద‌రాబాద్ లో డ్రైనేజీ పైప్‌ లైన్లు ద‌శాబ్ధాల క్రితం ఏర్పాటు చేసినవని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వాటిని తీసి కొత్త పైపులు వేయ‌డం చాలా క‌ష్టంతో కూడుకున్న పని అని చెప్పారు. మరమ్మతు పనులు చేపడితే నగర ప్రజలకు ట్రాఫిక్‌ కష్టాలు ఎదురవుతాయన్నారు. అందుకే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పైప్‌ లైన్లు పునరుద్ధరించేందుకు క్యూర్డ్ ఇన్‌ ప్లేస్‌ పైప్‌ టెక్నాలజీ వాడుతున్నామని చెప్పారు. హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని ఎస్టీపీ నుంచి జీహెచ్‌ఎంసీ కార్యాలయం వరకు దాదాపు 1.5 కిలోమీటర్ల మేర ప్రయోగాత్మకంగా పనులు చేపడుతున్నామన్నారు. దీని కోసం 18 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. ఈ ప్ర‌యోగం విజ‌య‌వంతమయితే న‌గ‌రంలో 120 కిలో మీట‌ర్ల మెయిన్ ట్రంక్  లైనును సీఐపీపీ పద్ధతిలో పునరుద్ధరిస్తామన్నారు.

సీఐపీపీ ద్వారా రోడ్డును తవ్వకుండానే డ్రైనేజీ పైపు లైన్‌ పునరుద్ధరణ పనులు చేపట్టవచ్చన్నారు మంత్రి కేటీఆర్‌. దీనివల్ల పైపు లైన్లు 40 నుంచి 50 ఏళ్ల పాటు మన్నికగా ఉంటాయన్నారు. హైడ్రోజ‌న్ స‌ల్ఫేట్‌ తో పాటు ప‌లు ర‌కాల‌ వాయువుల కార‌ణంగా పైపు లైన్లు కోత‌కు గురికాకుండా ఉంటాయని చెప్పారు. ఈ పద్ధతిని విదేశాల్లో ఇప్ప‌టికే వినియోగిస్తున్నార‌ని తెలిపారు. పైపు కింది భాగం స‌మాంతరంగా ఉండ‌డం వ‌ల్ల ఎలాంటి ఘ‌న ప‌దార్ధాలు పేరుకుపోవని మంత్రి కేటీఆర్‌ వివరించారు.

దేశంలోని ముఖ్యమైన నగరాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు అవసరమయ్యే వినూత్న ప్రయోగాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సీఐపీపీ పరికరాలు, సామాగ్రిపై 30 శాతం క‌స్ట‌మ్ డ్యూటీని కేంద్రం విధిస్తోందని చెప్పారు. దీన్ని తగ్గించాల్సిందిగా కేంద్రాన్ని కోరతామన్నారు. సీఐపీపీ టెక్నాలజీ కేవలం రాష్ట్రానికే కాదు దేశానికే ఉపయోగపడుతుందని తెలిపారు.

మినీ ఎయిర్‌ టెక్ యంత్రాల‌ను వినియోగించి మాన‌వ ర‌హిత పారిశుద్ద్య ప‌నులు చేప‌ట్టి దేశానికే ఆద‌ర్శంగా జ‌ల‌మండ‌లి నిలిచిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంచినీటిని సమర్థంగా సరఫరా చేయడంతో పాటు ఆధునిక సాంకేతికతను వినియోగించడంలో ముందున్న జ‌ల‌మండ‌లి ఎండీ దాన‌కిషోర్, ఇతర అధికారుల‌ను మంత్రి అభినందించారు.