రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీల దుర్మరణం

మహబూబ్‌ నగర్ జిల్లాలోని జడ్చర్ల దగ్గర 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నాటక రిజిస్ట్రేషన్ తో ఉన్న లారీ ఆటోను ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళా కూలీలు కాగా, ఆటో డ్రైవర్ కూడా ఉన్నాడు. వీరంతా జడ్చర్ల మండలం బండమీదిపల్లి గ్రామానికి చెందిన బాలమ్మ (66), లక్ష్మమ్మ (50), నాగమణి (30), రంగమ్మ (60), ఆటో డ్రైవర్ రఫియుద్దిన్. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మరొకరు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామంలో పత్తి ఏరేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో వీరు చనిపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి, గాయపడిన వారిని మహబూబ్ నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.