రైతులు ఇకచాలు అనేంత నీళ్లు ఇచ్చినం

మహబూబ్ నగర్ జిల్లాలో రైతులు ఇకచాలు అనేంతగా నీళ్లు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని మంత్రి హరీశ్ రావు అన్నారు. చెరువులు నిండి మత్తడి పారేలా, పొలాలు నిండి వరద పారేలా నీళ్లు ఇచ్చామన్నారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో టీడీపీ పక్ష నాయకుడు కృష్ణమోహన్ టిఆర్ఎస్ లో చేరిన సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగిన సభలో మంత్రి మాట్లాడారు.

గత పాలకుల హయాంలో కరువుతో అల్లాడిన మహబూబ్ నగర్ జిల్లా మొత్తం ఇప్పుడు పచ్చని పొలాలతో కళకళలాడుతోందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. గత ప్రభుత్వాలు పదమూడేళ్లలో మహబూబ్ నగర్ జిల్లాలో 20 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తే, టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిందని తెలిపారు. మరో రెండేళ్లలో మొత్తం 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని ప్రకటించారు. సమైక్య పాలకులు కృష్ణా నీటిని ఆంధ్రాకు తరలించుకొని పోతుంటే పాలమూరు జిల్లా కాంగ్రెస్ నేతలు నోరు మెదపలేదని విమర్శించారు.

పాలమూరు జిల్లా నుంచి వలస పోయిన ప్రజలు తిరిగి వస్తున్నట్టు అన్ని పార్టీల నుంచి నాయకులు, ప్రజలు టిఆర్ఎస్ లో చేరుతున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాజకీయ పునరేకీకరణలో గులాబీ జెండా నీడకు వస్తున్నారని చెప్పారు.

మహబూబ్ నగర్ జిల్లాలో రూ.800 కోట్ల ఖర్చుతో మెడికల్ కాలేజీ, మినీ ట్యాంక్ బండ్, రూ.100 కోట్లతో రింగు రోడ్డు సాధించిన ఘనత ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ దని హరీశ్ రావు ప్రశంసించారు. ఉద్యమంలో అందరం కలిసి పనిచేశాం కాబట్టే ఆయనకు అన్నింటిపై అవగాహన ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మహబూబ్ నగర్ జిల్లా బాగుపడిందని చెప్పారు. ఆనాడు కాంగ్రెస్ హయాంలో ఆంధ్రా ప్రాజెక్టుల పనులన్నీ వేగంగా జరిగాయని, తెలంగాణ పనులు పెండింగ్ పెట్టిన్రని మంత్రి విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ రన్నింగ్ ప్రాజెక్టులుగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చామన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దని అన్నారు.

2019 ఎలక్షన్లలో మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ కు ఉన్న సీట్లు కూడా రావని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. స్వంత జిల్లా ప్రజల అభివృద్ధిని అడ్డుకుంటున్న ఘనత కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. ప్రతిపక్షం అభివృద్ధిని కోరుకోవాలి తప్ప కేసులు వేసి అడ్డుకోవద్దని హితవు పలికారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు చూసి పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అక్కడ చేసుకుంటున్నారని, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.