రైతును రాజును చేసేందుకే సమన్వయ సమితులు

రైతులను రాజులను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నదని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. సంవత్సరానికి ఎకరానికి రెండు పంటలకు రూ. 8 వేలు పెట్టుబడి ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం చరిత్రాత్మకమని కొనియాడారు. ఈ రెండింటితో ప్రభుత్వం అన్నదాతలకు బతుకుపై భరోసా కల్పిస్తోందన్నారు. రాష్ట్రంలో రైతు సమన్వయ సమితుల ఏర్పాటు, ఎకరానికి రూ. 8 వేల పెట్టుబడిపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడారు.

రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటుందనే ఉద్దేశంతో రైతులను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. రైతుల కన్నీటిని తుడిచేందుకు సీఎం నిర్విరామంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించిన తర్వాత వలసలు ఆగిపోయాయని వీరేశం వివరించారు. చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండటంతో పంటలు వేసుకుని ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. రైతు సమన్వయ సమితులను, పెట్టుబడిని రైతులు స్వాగతిస్తున్నారని చెప్పారు. ఈ రెండు అంశాలు తమ జీవితాల్లో వెలుగులు నింపుతాయని రైతులు అంటున్నారని ఎమ్మెల్యే వీరేశం వివరించారు. రైతు సమన్వయ సమితులను అన్ని పార్టీలకు చెందిన రైతులు స్వాగతిస్తున్నారని, అన్ని పార్టీలకు చెందినవారు ఎంపికయ్యారని వెల్లడించారు.