రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లి కళ

రాష్ట్రానికి పెండ్లి కళ వచ్చింది. ఈ నెల 23 నుంచి 26 వరకు నాలుగు రోజుల పాటు మంచి ముహూర్తాలు ఉండటంతో వేలాది పెండ్లిండ్లకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాజధాని హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పెండ్లి మండపాలు ముందుగానే రిజర్వ్‌ అయిపోయాయి. పెండ్లి మండపాలు, అలంకారాలు, క్యాటరింగ్‌, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, మంగళవాయిద్యాలు, బ్యాండ్‌ బాజాల నుంచి వివాహ సంబంధిత వ్యాపారాలన్నింటికీ ఊహించని స్థాయిలో డిమాండ్‌ పెరిగింది. హైదరాబాద్‌ సహా పట్టణాలన్నింటిలోనూ పెండ్లి మండపాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సాధారణ సమయంలో…   లక్ష రుపాయల వరకూ అద్దె వసూలు చేసే పెండ్లి మండపాలు డిమాండ్‌ పెరగడంతో.. ఏకంగా మూడు లక్షల రుపాయల వరకు రోజుకు అద్దె వసూలు చేస్తున్నాయి. హోటల్‌ లో హాల్‌ బుకింగ్‌, ఒక్కో ప్లేట్‌ ధర కనీసం రూ.450 నుంచి ప్రారంభమవుతుంది. క్యాటరింగ్‌ ధరలైతే ఆకాశాన్ని అంటుతున్నాయి.

అక్టోబర్‌ 12 నుంచి నవంబర్‌ 10 వరకు గురుమౌఢ్యం కారణంగా నెల రోజుల పాటు ముహూర్తాలు లేకపోవడం, నవంబర్‌ 30  నుంచి దాదాపు రెండు నెలల ఇరవై రోజుల పాటు ఫిబ్రవరి 19 వరకు శుక్రమౌఢ్యం కారణంగా మళ్లీ వివాహాలు లేకపోవడంతో.. ఈ నాలుగు రోజులు తెలంగాణ రాష్ట్రం అంతా మంగళవాయిద్యాలతో మారుమోగనున్నది.

పెండ్లి ముహుర్తాలకు కలిసి వచ్చే నక్షత్రమైన ఉత్తరాషాఢ ఈ నెల 23న  ఉండటం, సెంటిమెంట్‌గా భావించే గురువారం కలిసి రావడంతో.. ఆరోజు ఉదయం 10 గంటల 6 నిమిషాల నుంచి మధ్యాహ్నం 11.56 అభిజిత్‌ లగ్నం వరకు అత్యధికంగా  ముహుర్తాలు ఉన్నాయి. మార్గశీర్శ మాసంలోని పంచమి తిథి ఉండటం వల్ల ఎక్కువ మంది తిథి, వార నక్షత్రాల ఉన్నత స్థితిని గమనించి ఈ ముహుర్తానికి ప్రాధాన్యం ఇచ్చారని శృంగేరీపీఠం అస్థాన విద్యాంసుడు బాచంపల్లి సంతోషకుమార శాస్త్రి వ్యాఖ్యనించారు. 24, 25, 26లతో ఎక్కువ ముహుర్తాలు పెట్టారు. నవంబర్‌ 29న కూడా కొన్ని ముహుర్తాలు నిర్ణయించారు. 24న శుక్రవారం తులా లగ్నంలో దివ్యమైన ముహుర్తం ఉన్నదని భాగ్యనగర అర్చక పరిషత్‌ అధ్యక్షుడు భాస్కరభట్ల రామశర్మ,  కార్యదర్శి వేదాంతం చరణ్‌, కరీంనగర్‌ జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు  అవదాని మోహన్‌ శర్మలు పేర్కొన్నారు. 25 శనివారం సప్తమి తిథికి ప్రాముఖ్యమిచ్చారని నల్లగొండ జిల్లా అర్చక సమాఖ్య నాయకుడు శేషు రఘునందన్‌ వివరించారు.