రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా దీక్ష దివాస్

రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష దివస్ వేడుకలు అంబరాన్నంటాయి. మంచిర్యాల, ఆదిలాబాద్‌ , నిర్మల్‌ జిల్లాలోనూ దీక్షా దివస్ ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్మల్‌లో నిర్వహించిన దీక్షాదివస్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడి ఆమరణ దీక్ష చేపట్టారని  గుర్తుచేశారు. ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు.

మంచిర్యాలలో దీక్షా దివస్‌ సందర్భంగా పలువురు టీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొన్నారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. అటు ఆదిలాబాద్‌లోనూ పలువురు టీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతంర ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్ లో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షా దివస్ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్ రావు, మేయర్ రవీందర్ సింగ్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రవీందర్ రెడ్డి హాజరయ్యారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.అటు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కరీంనగర్ కోర్టు చౌరస్తాలోనూ దీక్ష దివస్ చేపట్టారు. జాగృతి నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు నిర్వహించిన  కార్యక్రమాలు అలరించాయి.

సీఎం కేసీఆర్ ఆమరణ దీక్షతోనే తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభమైందని చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ అన్నారు. దీక్షా దివాస్‌ను పురస్కరించుకుని.. కరీంనగర్  జిల్లా  గంగాధర మండల కేంద్రంలోని ప్రభుత్వ  పాఠశాలలో విద్యార్థులకు  ప్లేట్లు, పండ్లు  పంపిణీ చేశారు ఎమ్మెల్యే బోడిగె శోభ.

సంగారెడ్డిలో దీక్షా దివస్‌ ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జరిగిన దీక్షా దివస్‌లో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షతోనే తెలంగాణ కల సాకారమైందన్నారు.

దీక్షా దివస్‌ సందర్భంగా ఖమ్మంలో  ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరాన్ని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, మేయర్ పాపాలాల్ ప్రారంభించారు.  అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి, స్వరాష్ట్ర ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు నవంబర్ 29 అని  అన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో మరచి పోలేని  రోజని  చెప్పారు.

నల్గొండలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించారు. పట్టణంలో విద్యార్థులతో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ఎమ్మెల్యే గాదరి  కిశోర్ తో పాటు  అటవీ అభివృద్ధి సంస్ద ఛైర్మెన్   బండా నరేందర్ రెడ్డి,  టీఆర్ఎస్ నల్లగొండ అసెంబ్లీ ఇంచార్జ్ భూపాల్ రెడ్డి, బ్రహ్మణ పరిషత్ సభ్యుడు చకిలం అనిల్ కుమార్ లు హాజరయ్యారు….సీఎం కెసీఆర్ చూపిన మార్గంలో నడుస్తూ ప్రతి ఒక్కరు బంగారు తెలంగాణా కోసం కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.  అటు టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరాన్ని  టిఆర్‌యస్ రాష్ట్ర కార్యదర్శి  చాడ కిషన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం రోగులకు  పాలు, పండ్లు పంపిణీ చేశారు. అటు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో క్లాక్ టవర్‌ సెంటర్‌లో ఒక్కరోజు  దీక్ష చేపట్టారు.

సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో దీక్షా దివాస్ ఘనంగా జరుపుకున్నారు టీఆర్ఎస్వీ నాయకులు. ఉద్యమ నేతగా ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుని నేటికి ఎనిమిది ఏండ్లు పూర్తయింది. అమరవీరులను, ఉద్యమ సమయంలో చోటు చేసుకున్న ఘటనలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఆస్పత్రిలో గర్భణీ స్త్రీలకు, బాలింతలకు, రోగులకు… పాలు, పండ్లు పంపిణీ చేశారు.

ఉస్మానియా యూనివర్శిటీలో దీక్షా దివస్ సందర్భంగా 2కే రన్ నిర్వహించారు. టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో జరిగిన ఈ రన్‌లో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని 2009 నవంబర్ 29న ఆమరణ దీక్షతో సీఎం కేసీఆర్ మలుపు తిప్పారని టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ ప్రజలు దీక్ష దివాస్‌ను పండుగలా జరుపుకుంటున్నారని చెప్పారు.