రాష్ట్రంలో సౌర విద్యుత్ ను ప్రోత్సహిస్తున్నాం

రాష్ట్రంలో సోలార్ విద్యుత్‌ను  ప్రోత్సహిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 2,792 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ప్రకటించారు. థర్మల్ విద్యుత్ వల్ల ఏర్పడే కాలుష్యం, ఇతరత్రా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని.. సోలార్ విద్యుత్‌తో పాటు పవన విద్యుత్‌ను  ప్రోత్సహిస్తున్నామని స్పష్టం చేశారు. సోలార్, పవన విద్యుత్ అన్ని వేళలా ఆధారపడదగినది కాదని…… కాబట్టి అవసరాలను బట్టి థర్మల్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. 15 నుంచి 20 శాతం విద్యుత్ను సంప్రదాయక పద్ధతుల్లో ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. ప్రధానంగా పవన విద్యుత్కు సంబంధించి చాలా సమస్యలు వస్తున్నాయని చెప్పారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని మంత్రి స్పష్టం చేశారు. విద్యుత్ ఉత్పత్తిలో ఎలాంటి కొత్త విధానం వచ్చినా.. రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పారు. చెత్త ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని మంత్రి జగదీష్రెడ్డి పేర్కొన్నారు.శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సోలార్ విద్యుత్‌పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.