రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గింది

తెలంగాణలో నిరుద్యోగుల శాతం తగ్గిందని ఇటీవలే కేంద్ర కార్మిక శాఖ నివేదిక ఇచ్చిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై లఘు చర్చ సందర్భంగా శాసనసభలో కిషోర్ మాట్లాడారు. ఇప్పటి వరకు ప్రభుత్వం 36,806 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిందన్నారు. 28,660 పోస్టులను భర్తీ చేసినట్లు చెప్పారు. పోలీసు శాఖలో 10,449 పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. టీఎస్పీఎస్సీ ఇప్పటివరకు 73 నోటిఫికేషన్లు ఇచ్చిందన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై బీజేపీ మొసలికన్నీరు కారుస్తోందని మండిపడ్డారు. 2 లక్షల 50 వేల ఉద్యోగాలు ఇస్తామన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. 15 వేల ఉద్యోగాలను కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ కేవలం 4 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందన్నారు. టీఎస్‌పీఎస్సీ నిజాయితీగా పని చేస్తోందని స్పష్టం చేశారు. నోట్ల రద్దు తర్వాత ఉపాధి అవకాశాలు తగ్గాయని కిషోర్ పేర్కొన్నారు.