యూపీ స్థానిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభం

ఉత్తరప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. 24 జిల్లాల్లో పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుండగా…. ఈ నెల 26న రెండో దశ, 29న మూడో దశ పోలింగ్ జరుగనుంది. ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్లకు ఓటర్లు క్యూ కట్టారు. గోరఖ్‌ పూర్ లో సీఎం యోగీ ఆదిత్యానాధ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. యోగీ సీఎం అయిన తర్వాత జరుగుతున్న తొలి పోలింగ్ కావడంతో… ఆయన 8 నెలల పాలనకు ప్రజలు ఇచ్చే తీర్పు కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ 1న జరుగనుంది. యూపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ప్రభావం గుజరాత్ ఎన్నికలపై కూడా పడే అవకాశముంది. అందుకే పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం నిర్వహిస్తున్నాయి.