యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తి వేదిక

నాలుగొందల ఏళ్లకు పైబడిన చరిత్ర కలిగిన హైదరాబాద్‌ మహానగరం యువ పారిశ్రామికవేత్తల్లో స్ఫూర్తి నింపబోతోంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఆంట్రప్రెన్యూర్ షిప్ సమ్మిట్‌తో ఎంతో మంది ఔత్సాహికుల కలలు నిజం కానున్నాయి. మూడు రోజుల పాటు సాగే సదస్సు యంగ్‌ ఆంట్రప్రెన్యూర్స్.. వారి ఆలోచనలు మెచ్చి పెట్టుబడులు పెట్టే వెంచర్‌ క్యాపిటలిస్టులు.. వీరి మధ్య సాగే సమావేశాలు… అనుభవజ్ఞుల స్ఫూర్తిదాయక ఉపన్యాసాలతో నూతనోత్సాహాన్ని నింపనుంది.

ఈ నెల 28, 29, 30 తేదీల్లో హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీ వేదికగా జరిగే 8వ గ్లోబల్‌ ఆంట్రప్రెన్యూర్ షిప్ సమ్మిట్‌కు 150 దేశాల నుంచి 12 వందల మంది పారిశ్రామికవేత్తలు, 3వందల మంది ఇన్వెస్టర్లు, వివిధ రంగాల్లో అపార అనుభవం కలిగిన 50 మందికిపైగా ప్రముఖులు హాజరుకానున్నారు.

ఉమెన్‌ ఫస్ట్‌.. ప్రాస్పిరిటీ ఫర్‌ ఆల్‌ థీమ్‌తో నిర్వహిస్తున్న సదస్సులో అందుకు తగ్గట్లుగానే 52.5శాతం మంది మహిళా ప్రతినిధులు భాగస్వాములు అవుతున్నారు. పదికి పైగా దేశాల నుంచి కేవలం మహిళా ప్రతినిధులే సమ్మిట్‌కు హాజరుకావడం ఒక విశేషమైతే… ఆఫ్ఘనిస్తాన్‌, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌ తదితర దేశాలు ఆ పది దేశాల్లో ఉండటం మరో విశేషం. 28న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్‌తో పటు అమెరికా ప్రెసిడెంట్‌ కుమార్తె, ఆయన అడ్వైజర్‌ ఇవాంకా ట్రంప్‌ పాల్గొంటారు. ఇనాగురేషన్‌ సెర్మెనీలో ఈ ముగ్గురు మాత్రమే ప్రసంగించనున్నారు.

మూడు రోజుల పాటు జరిగే సదస్సును మొత్తం 53 సెషన్లుగా విభజించారు. నాలుగు ప్రధాన రంగాలైన హెల్త్‌ కేర్‌ అండ్‌ లైఫ్‌ సైన్సెస్‌, మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, డిజిటల్‌ ఎకానమీ అండ్‌ ఫైనాన్షియల్‌ టెక్నాలజీ, ఎనర్జీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లో వస్తున్న మార్పులు, ఆవిష్కరణపై చర్చ జరగనుంది. ఏటా జరిగే గ్లోబల్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌కు దక్షిణాసియా దేశం ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి.

జీఈఎస్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్‌కం స్పీచ్‌ అనంతరం ఇవాంకా ట్రంప్‌, ప్రధాని నరేంద్రమోడీ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాధికారత, స్వావలంబన లక్ష్యాలుగా మహిళలకు ప్రాధాన్యమివ్వటంతో ఈ సదస్సు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారావకాశాలు, కొత్త ఆలోచనలు, పెట్టుబడులు, వ్యాపారరంగంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలు చర్చకు వచ్చేలా ఇప్పటికే  షెడ్యూల్‌ సిద్ధం చేశారు. స్టార్టప్స్‌, యువ పారిశ్రామికవేత్తలు ఆలోచనలు పంచుకోవడం, పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా వీటిని రూపొందించారు.