మైనారిటీలకు రిజర్వేషన్లు సాధించి తీరుతాం

తెలంగాణకు విశిష్టమైన చరిత్ర ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాజులకాలం నాటి నుంచి నేటిదాకా మతకల్లోలం జరిగిన దాఖలాలు లేవని.. గంగాజమునా తెహజీబ్‌తో ప్రపంచానికి తెలంగాణ ఆదర్శంగా ఉన్నదని వివరించారు. మైనార్టీ సంక్షేమంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ అలయ్-బలయ్‌తో గొప్పగా వర్ధిల్లిన ప్రాంతమన్నారు. గాంధీజీతోపాటు ఎంతోమంది తెలంగాణ చరిత్రను పొగిడారని తెలిపారు.

రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని సుప్రీంకోర్టు నిబంధన ఉందని, ప్రత్యేకమైన ప్రక్రియ ద్వారానే రిజర్వేషన్ల పెంపు సాధ్యమవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. తమిళనాడులో 9వ షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక చట్టం చేసి రిజర్వేషన్లు పెంచారని గుర్తుచేశారు. ముస్లింలతోపాటు గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని ప్రధానిని కోరామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రిజర్వేషన్ల పెంపుపై ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారని, వీలైనంత త్వరగా ప్రధానిని కలిసి.. కేంద్రాన్ని ఒప్పించి రిజర్వేషన్లు సాధిస్తామన్నారు.

అడుగుతున్న రిజర్వేషన్ గొంతెమ్మ కోరిక కాదు.. న్యాయమైన డిమాండ్ అన్నారు సీఎం. శక్తి మేరకు ప్రయత్నించి రిజర్వేషన్లను సాధిస్తామని స్పష్టం చేశారు. 10వ షెడ్యూల్‌లో పంచాయితీ తెగనందువల్లే కమిటీలు వేయలేదన్నారు. అధికారులతో కమిటీ వేసి హజ్‌యాత్రను చేపట్టడంపై కేంద్రం ప్రశంసించిందని సీఎం తెలిపారు. మైనార్టీల విషయంలో సమైక్య పాలకులు తీవ్ర నిర్లక్ష్యం చేశారని, తాము క్రిస్టియన్, సిక్కులు, ఇతర మైనార్టీలను గౌరవించామన్నారు.

కరీంనగర్ మేయర్‌గా ఒక సిక్కు వ్యక్తిని నియమించిన ఘనత తమ పార్టీది, ప్రభుత్వానిదని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రాంతం గొప్ప దైవభూమి. క్రిస్మస్, రంజాన్, బోనాలను ఘనంగా నిర్వహించామన్నారు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ముస్లిం, క్రిస్టియన్, సిక్కు పిల్లలు చదువుతున్నారని తెలిపారు. వక్ఫ్ బోర్డు దగ్గర భూముల లెక్కలే లెవ్వని సీఎం అన్నారు. వక్ఫ్ సీజ్ చేయాలని ఆదేశించినట్లు సీఎం వెల్లడించారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షిస్తామని స్పష్టం చేశారు. సంస్కరణలు చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి 50 ఏళ్ల సమయం సరిపోలేదా? అని ప్రశ్నించారు.

అధికారంలో లేమని ఏది పడితే మాట్లాడటం కాంగ్రెస్‌కు సబబు కాదని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ముస్లింలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. కేంద్రం మైనార్టీ గురుకులాలకు రూ.230 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. ఇతరులకు రాజకీయాలు గేమ్.. తమకు టాస్క్ అని సీఎం అన్నారు. మొదటి టాస్క్ తెలంగాణ సాధించడం పూర్తయిందని, రెండో టాస్క్ తెలంగాణ పునర్నిర్మాణం మొదలైందన్నారు.

ఉర్దూ భాషను పరిరక్షిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఉర్దూ స్పెషల్ డీఎస్సీ ద్వారా 900 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఉర్దూ అకాడమీలో 66 మంది ఉద్యోగులను నియమిస్తామన్నారు. కలెక్టరేట్లతోపాటు ముఖ్య కార్యాలయాల్లో ఉర్దూ ఆఫీసర్ల నియామకం చేపడుతామని తెలిపారు. నీట్ పరీక్షను ఉర్దూలో నిర్వహించాలని ప్రధానికి లేఖ రాశామని గుర్తుచేశారు. రాష్ట్రంలో అన్ని పోటీ పరీక్షలను ఉర్దూ భాషలోనూ నిర్వహిస్తామని పేర్కొన్నారు.