మైనారిటీలకు దేశంలో ఎక్కడా లేనన్ని పథకాలు

మైనారిటీల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు చెప్పారు. భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా సిద్దిపేటలో జరిగిన మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ పాలకుల నిర్లక్ష్యం వల్ల ముస్లిం మైనారిటీలు పేదరికంలో మగ్గిపోయారని హరీశ్ రావు విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉర్దూను రెండో అధికార భాషగా ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. నీట్ పరీక్షను ఉర్దూలో కూడా నిర్వహించే విధంగా  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడారని గుర్తుచేశారు. తెలుగు భాషను తప్పనిసరిగా బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విద్యా సంస్థలకు ఆదేశమిచ్చిందని తెలిపారు. కొన్ని కార్పోరేట్ విద్యాసంస్థలు విద్యార్థులకు తెలుగు భాష బోధించడం లేదన్నారు. గత ప్రభుత్వాలు  మైనార్టీలను ఓట్లుగా మాత్రమే చూశాయని, తెలంగాణ అభివృద్ధిలో మైనారిటీలను భాగస్వాములను చేయాలన్నదే టిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం అన్నారు.

సిద్దిపేటలోని ముస్తాబాద్ రోడ్డులో ఉన్న తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారుఖ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన మార్చ్‌ ఫాస్ట్ ఆకట్టుకుంది.