మెట్రో రైలు ప్రారంభోత్సవానికి రెడీ

హైదరాబాద్ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరిపోయే సమయం ఆసన్నమైంది. నగర ప్రజలకు త్వరలోనే మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. మెట్రో రైలును ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే నాగోల్-మియాపూర్‌ రూట్లో పలు దఫాలుగా మెట్రో రైలు ట్రయల్ రన్స్ నిర్వహించారు. అమీర్‌ పేట రూట్లో రాత్రిపూట కూడా మెట్రో రైలును నడిపి చూశారు. ట్రయల్ రన్స్ సక్సెస్ కావడంతో.. ఇక పూర్తి స్థాయిలో మెట్రో రైలు సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

మెట్రో రైలు ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో.. మెట్రో రైలు సేవలను గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్ స్వయంగా పరిశీలించారు. ఎస్సార్ నగర్ నుంచి మియాపూర్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు..  మియాపూర్‌ స్టేషన్‌ ప్రాంగణంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆ తర్వాత మియాపూర్ డిపోను సందర్శించారు. పనులపై మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గవర్నర్‌కు వివరించారు. నాగోల్‌ -మియాపూర్‌ మార్గంలోని 24 స్టేషన్లలో ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. అత్యాధునిక కమ్యూనికేషన్‌ బేస్ట్‌ ట్రైన్‌ కంట్రోల్‌ సిస్టం వాడుతున్నామని, ఈ విధానంలో ప్రతి రెండు నిమిషాలకు ఒక రైలును నడపవచ్చని తెలిపారు. డ్రైవర్‌ అవసరం లేని టెక్నాలజీ వినియోగిస్తున్నామని, అయినా ప్రతి రైల్లో ఇద్దరు లోకో పైలెట్లు ఉంటారన్నారు. మెట్రో స్టేషన్ల లే అవుట్లు, అడ్వాన్సడ్ బ్రేకింగ్‌ సిస్టం ద్వారా 40 శాతం విద్యుత్‌ ఆదా అవుతుందన్నారు. అన్ని స్టేషన్ల వద్ద సైడ్‌ వాక్స్‌, ఫుట్‌ పాత్‌, స్ట్రీట్‌ ఫర్నీచర్‌, పచ్చదనం, వంటి సౌకర్యాలు, సుందరీకరణ పనులు చేపట్టామన్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ రానున్నందున ఏర్పాట్లపై చర్చించారు… తిరిగి అదే మెట్రో రైలులో ఎస్సార్ నగర్‌కు తిరిగి వచ్చారు.

మెట్రో రైల్‌ పై ప్రశంసల వర్షంపై కురిపించారు గవర్నర్‌ నరసింహన్‌. స్టేషన్ లే అవుట్లు, స్టేషన్లలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు బాగున్నాయని కితాబిచ్చారు. ఐతే పరిశుభ్రతపై ప్రయాణికుల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పరిశుభ్రత విషయంలో ప్రయాణికుల్లో మార్పు తెచ్చి..స్వీయ క్రమశిక్షణ అలవర్చేందుకు త్వరలో అవగాహన కార్యక్రమాలు చేపడుతామన్నారు మంత్రి కేటీఆర్‌. జీహెచ్‌ఎంసీ, పోలీస్‌, ఇతర ఆసక్తి ఉన్న ప్రవేటు సంస్థలను కలుపుకుని ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తామని చెప్పారు. మొదటి దశలో నాగోల్ నుంచి మియాపూర్ వరకు మొత్తం 30 కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్‌ ప్రారంభం కాబోతోంది. ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయని  హైదరబాదీలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.