మెట్రో రైలు ప్రారంభానికి సిద్ధం

ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న హైదరాబాద్‌ మెట్రో రైల్‌ త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ నెల 28న హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ను ప్రధాని మోదీ ప్రారంభించబోతున్నారు. 30 కిలో మీటర్ల నాగోల్-మియాపూర్ మార్గంలో రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మార్గంలోని మెట్రో స్టేషన్లన్నీ సర్వాంగసుందరంగా తయారు చేస్తున్నారు. పరిసరాలను పూలమొక్కలు, చెట్లతో ఆహ్లాదభరితంగా మార్చారు. మరోవైపు స్టేషన్ల లోపల ఎయిర్‌పోర్ట్ స్థాయి ఏర్పాట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దారు. ఒక్కో స్టేషన్‌ను రోడ్డు లెవల్, కాంకర్స్ లెవల్, ప్లాట్‌ఫాం అనే మూడు అంతస్తులుగా విభజించి సౌకర్యాలు కల్పించారు. ప్రతి అంతస్తులో సూచికలు, మ్యాప్‌లు ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం ప్రతి అంతస్తులో వీల్‌చైర్లు ఏర్పాటు చేశారు. సమాచారాన్ని ప్రయాణికులకు చేరవేసేందుకు ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. ప్రతి అంతస్తు సీసీటీవీల నిఘాలో ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఫైర్ ప్రొటెక్షన్, ఎమర్జెన్సీ లైటింగ్, సిగ్నల్స్, ఆటోమెటిక్‌గా తెరుచుకునేలా టికెటింగ్ గేట్లు వంటివి ఏర్పాటు చేశారు. అత్యవసర మెట్ల మార్గాలను కూడా నిర్మించారు. ప్రయాణికులను గైడ్ చేయడానికి నావిగేషన్ సిస్టం ఏర్పాటు చేశారు.

రోడ్డు లెవల్‌లో ఉన్న అంతస్తును స్ట్రీట్ లెవెల్‌గా పిలుస్తారు. ప్రయాణికులు ఇక్కడి నుంచే మెట్లు, లిఫ్టులు, ఎస్కలేటర్ల ద్వారా రెండో అంతస్తుకు చేరుకుంటారు. రోడ్డుకు ఇరువైపులా వీటిని ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం ర్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. రోడ్డు మీద ప్రయాణించేవారికి ఇబ్బంది కలుగకుండా వీటిని నిర్మించారు. ప్రయాణికులు స్ట్రీట్‌లెవల్ నుంచి కాంకర్స్ లెవల్‌కు చేరుకుంటారు. ఇక్కడ టికెట్ల జారీ, హెల్ప్‌ డెస్క్, సెక్యూరిటీ, కాఫీ, టీ సెంటర్లు, షాపింగ్ వంటి ఏర్పాట్లు ఉంటాయి. ఈ అంతస్తును పెయిడ్, నాన్ పెయిడ్ ఏరియాలుగా వర్గీకరించారు. ఎవరైనా ఈ అంతస్తుకు రావచ్చు. అయితే ప్రయాణికులు కానివారు షాపింగ్ ఏరియాకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. టికెట్ తీసుకున్నవారిని మాత్రమే ప్లాట్‌ఫాం ఉన్న అంతస్తుకు అనుమతిస్తారు. టికెట్ల జారీ కోసం కౌంటర్లు, టికెట్ వెండింగ్ మెషిన్స్ ఏర్పాటు చేశారు. టికెట్లను పరిశీలించే ఆటోమెటిక్ టికెట్ కలెక్టివ్ మెషిన్స్, బ్యాగేజ్ స్కానర్స్, మెటల్‌డిటెక్టర్లు వంటివి ఉంటాయి. స్టేషన్ మేనేజర్, ఫస్ట్ ఎయిడ్ సిబ్బంది ఇక్కడే ఉంటారు. ఈ అంతస్తులోనే వాష్‌రూంలు ఉంటాయి.

చివరి అంతస్తు ప్ల్లాట్‌ఫాం లెవల్. ఇక్కడే ప్లాట్‌ఫాం ఉంటుంది. టికెట్ ఉన్న ప్రయాణికులు మాత్రమే కాంకర్స్ లెవల్‌లోని లిఫ్టులు, ఎస్కలేటర్లు, మెట్ల ద్వారా ఇక్కడికి చేరుకుంటారు. రైలు ఎక్కి తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. కాంకర్స్, ప్లాట్‌ఫాం లెవల్‌లో లొకేషన్ మ్యాప్‌తోపాటు, రైళ్ల రాకపోకలకు సంబంధించిన వివరాలు తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ఉంటాయి. టెలిఫోన్ సౌకర్యం ఉంటుంది. ఇక్కడ కూడా సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు.