మెట్రో పరుగులకు రెడీ

మరో వారం రోజుల్లో భాగ్యనగర ప్రజల కల నెరవేరబోతోంది. ఈ నెల 28న ప్రధాని మోదీ మెట్రోరైల్‌ను ప్రారంభించబోతున్నారు. ఆ మరుసటి రోజు మెట్రోలో ప్రయాణించేందుకు సామన్య ప్రజలను అనుమతించనున్నారు. ఐతే 28నే మెట్రో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భావించినా..మెట్రో రైల్‌ సిబ్బంది ప్రారంభోత్సవం రోజున హడావుడిగా ఉండటంతో పాటు ప్రముఖుల పర్యటనతో హడావిడి వాతావరణం నెలకొనే అవకాశం ఉండడంతో ప్రయాణికులను అదేరోజు మెట్రోలో ప్రయాణానికి అనుమతించడం మంచిదికాదన్న నిర్ణయానికి అధికారులు వచ్చాయి. మరుసటి రోజు ఉదయం నుంచి సాధారణ ప్రయాణికులకు అవకాశం ఇస్తామని హైదరాబాద్ మెట్రోరైల్ సంస్థ వర్గాలు తెలిపాయి.

మరోవైపు మియాపూర్-అమీర్‌పేట మధ్య 8 రైళ్లు, నాగోల్-అమీర్‌పేట మార్గంలో 10 రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. మియాపూర్-అమీర్‌పేట మధ్య ప్రతి ఏడు నిమిషాలకు ఒకరైలు, నాగోల్-అమీర్‌పేట మధ్య ప్రతి 10 నుంచి 12 నిమిషాల మధ్య రైలు సర్వీసులను నడపనున్నారు. ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు 17 గంటలపాటు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఒక్కో ట్రిప్పుకు 974 మంది ప్రయాణికులను గమస్థానాలకు చేర్చే సామర్థ్యం ఉన్నది. మియాపూర్-అమీర్‌పేట మధ్య సగటున గంటకు 9 రైళ్లు నడిపితే గంటకు 8,766 మంది చొప్పున రోజుకు 1.53 లక్షల మంది ప్రయాణించవచ్చు. నాగోల్-అమీర్‌పేట మధ్య గంటకు 6 రైళ్లు నడిపితే గంటకు 5,844 మంది చొప్పున రోజుకు 1.02 లక్షల మంది ప్రయాణించే వీలుంది. మొత్తంగా రోజుకు 2.5 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చే అవకాశం ఉన్నది. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి తర్వాతి రోజుల్లో ప్రతి 3 నుంచి 5 నిమిషాల వ్యవధిలో రైళ్లను నడుపడానికి ఎల్‌అండ్‌టీ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి.
30 కిలోమీటర్ల మేర ప్రారంభం కానున్న మెట్రో మార్గంలో రైళ్లు 1,117 పిల్లర్లపై పరుగులు పెట్టనున్నాయి. మియాపూర్-అమీర్‌పేట మధ్య 464 స్తంభాలు, నాగోల్-అమీర్‌పేట వరకు 653 స్తంభాలు ఉన్నాయి. ఈ మార్గంలో మొత్తం 24 స్టేషన్లు ఉండగా అమీర్‌పేట్ ఇంటర్‌చేంజ్ స్టేషన్ అతిపెద్దదిగా నిలువనుంది. మొత్తం హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టులోనే అతిపెద్ద స్టేషన్‌గా అవతరించనుంది. మిగతా మెట్రోస్టేషన్లను 65వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించగా.. అమీర్‌పేట ఇంటర్‌చేంజ్ మాత్రం రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైంది. అంటే మిగతా స్టేషన్ల కంటే దాదాపు మూడురెట్టు ఎక్కువ.