మెట్రోలో ప్రయాణించాలంటే ఇవి పాటించాల్సిందే!

హైదరాబాద్ మెట్రో రైల్‌ నిర్వాహకులు ప్రయాణికులకు కచ్చితమైన నిబంధనలు పెట్టారు. ఆర్టీసీ బస్సులు, రైళ్లు, ఎంఎంటీఎస్‌ రైళ్లలో మాదిరిగా మెట్రో రైళ్లలోనూ ఇష్టారీతిగా వ్యవహరిస్తే కుదరదని స్పష్టం చేస్తున్నారు. నిబంధనలను ఏ మాత్రం ఉల్లంఘించినా శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక సౌకర్యాలతో హైదరాబాద్‌ నగర ప్రజలకు అందుబాటులోకి వస్తున్న మెట్రో రైలు.. ఇప్పటివరకు ఉన్న ప్రజా రవాణా వ్యవస్థలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. మెట్రో రైలులో ప్రయాణించే ముందు ప్రజలు అనేక విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే. మెట్రో రైళ్లు, స్టేషన్లు, ప్లాట్‌ఫాంల్లో అడుగడుగునా భద్రత, నిఘా వ్యవస్థ ఉంటుంది. ఏ మాత్రం నిబంధనలు ఉల్లంఘించినా.. ఇట్టే పసిగట్టి సాక్ష్యాధారాలతో సహా శిక్షలు విధించేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా అందుబాటులోకి రాబోతున్న హైదరాబాద్‌ మెట్రో రైలులో అనుసరించాల్సిన పద్ధతులను ప్రయాణికులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మెట్రో అధికారులు చెబుతున్నారు.

మెట్రో రైలు ప్రయాణికులు పడేసే ఏ వస్తువులనైనా తప్పనిసరిగా డస్ట్‌ బిన్‌లలో వేయాలి. స్టేషన్‌ లోపల అనౌన్స్‌మెంట్లను జాగ్రత్తగా వినాలి. ఏదైనా అవసరమైతే వెంటనే సమీపంలోని కస్టమర్‌ సర్వీస్‌ బృందం లేదా స్టేషన్‌ సిబ్బందిని సంప్రదించాలి. ఎవరైనా ఇబ్బందులు కలిగించినా, అసాంఘిక కార్యకలాపా లకు పాల్పడినా భద్రతా సిబ్బందికి సమాచారమివ్వాలి. స్టేషన్‌ సిబ్బంది, భద్రతా సిబ్బందికి సహకరించాలి. మెట్ల మార్గాలు, ఎస్కలేటర్లపై జాగ్రత్తగా వెళ్లాలి. ప్రయాణికులు తమ సామగ్రిని జాగ్రత్తగా తీసుకువెళ్లాలి. రైల్లో నిలబడి ఉన్నప్పుడు హ్యాండ్‌ రెయిల్‌ను పట్టుకొని రైలు వెళుతున్న వైపు తిరిగి ఉండాలి. ఎస్కలేటర్‌లో ఎప్పుడూ ఎడమ వైపు నిల్చుని గమ్యస్థానం వచ్చే వరకు వేచి చూడాలి. మెట్రోలో ప్రయాణం చేసేటప్పుడు వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, పిల్లలకు సహకరించాలి. బేబీ బ్యాగీస్‌, చక్రాల కుర్చీలో వెళ్లేవారు తప్పనిసరిగా లిఫ్టుల్లో ప్లాట్‌ఫాం లెవల్‌కు వెళ్లాలి. ఎస్కలేటర్‌ నుంచి దిగిన వెంటనే పక్కకు జరిగిపోవాలి.

టికెట్‌ కౌంటర్ల వద్ద, టిక్కెట్‌ వెండింగ్‌ మిషన్‌ల వద్ద క్యూ పద్ధతిని పాటించాలి. రైల్లో ఎక్కేందుకు వెళ్లే మార్గంలో ఉన్న ఆటోమేటిక్‌ ఫేర్‌ కలెక్షన్‌ గేట్స్‌ వద్ద క్యూలో వెళ్లాలి. మెట్రో రైలు ప్రయాణం కోసం తీసుకున్న టోకెన్లను, స్మార్ట్‌ కార్డులను తనిఖీల సమయంలో చూపించాల్సి ఉంటుంది. అత్యవసర సమయాల్లో అధికారులు ప్రకటన చేయగానే స్టేషన్‌ల నుంచి నిర్దేశిత మార్గాల్లో బయటకు వెళ్లిపోవాలి. మెట్రో రైలు ఎక్కేముందు ప్లాట్‌ఫాంపై నిర్దేశిత దూరంలోనే నిలబడి ఉండాలి. ప్రయాణికులంతా ఈ నిబంధనలు పాటించాల్సిందే.  

మెట్రో ప్రాంగణాల్లో ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయడం, చెత్తను పారవేయడం నిషిద్ధం. స్టేషన్‌ లోపల ఎట్టి పరిస్థితుల్లోనూ పాన్‌, గుట్కా, పొగాకు, తంబాకు నమలకూడదు. మెట్రో ప్రాంగణంలో పొగ తాగొద్దు, మద్యం సేవించొద్దు. ఫొటోలు తీయకూడదు. మెట్రో ప్రాంగణాల్లో వస్తువులు, లగేజీ వదిలి వెళ్లరాదు. మెట్రో ప్రాంగణం, రైల్లో ఆహార పదార్థాలు, కూల్‌ డ్రింక్స్‌ను తీసుకోవద్దు. పెంపుడు జంతువులను తీసుకువెళ్లడానికి అనుమతి లేదు. నిషేధిత, మండే పదార్థాలను మెట్రోలో తీసుకెళ్లరాదు. ఎక్కువ మొత్తంలో లగేజీ తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. ఎస్కలేటర్లపై కూర్చోవడం, అడ్డుకునే ప్రయత్నాలు చేయకూడదు. ప్లాట్‌ఫాంపై రైళ్ల కోసం వేచి ఉన్న సమయంలో పసుపు రంగుతో ఉండే హద్దును దాటి వెళ్లకూడదు. రైలు తలుపులను బలవంతంగా తెరిచే ప్రయత్నించవద్దు.

మెట్రో రైల్లో పిల్లలను జాగ్రత్తగా పట్టుకొని ఉండాలి. భద్రతా సిబ్బంది అనుమతి లేకుండా వస్తువుల రవాణా పూర్తిగా నిషేధం.  ఆటోమేటిక్‌ ఫేర్‌ కలెక్షన్‌ గేట్లను దూకేప్రయత్నం చేయొద్దు. చెల్లుబాటయ్యే టిక్కెట్లను వాడి, గేట్లు తెరుచుకున్న తర్వాతే లోపలికి వెళ్లాలి. సరైన కారణాల్లేకుండా రైలు డ్రైవర్‌తో మాట్లాడకూడదు. మెట్రో రైలు ప్రాంగణాల్లో హాకర్స్‌ తిరగడం నిషేధం. రైలు దిగే/ఎక్కే సమయంలో డోర్లకు దగ్గరలో ఉండొద్దు. ప్రయాణానికి ఒకసారి తీసుకున్న టికెట్‌(టోకెన్‌)ను మళ్లీ మళ్లీ వినియోగించరాదు. అలా చేస్తే టిక్కెట్‌ లేని ప్రయాణం కింద శిక్ష, జరిమానా ఉంటుంది. మెట్రో రైళ్లలో భద్రతా పరికరాలను ట్యాంపర్‌ చేయరాదు. మెట్రో స్మార్ట్‌ కార్డు, టోకెన్‌ను ఇతరులతో పంచుకోరాదు.