మురుగు కాల్వల నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం

హైదరాబాద్ నగరంలోని మురుగు కాల్వల నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా జీహెచ్‌ఎంసీలో వరద నీటి కాలువల వ్యవస్థపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. జంట నగరాల్లో చెరువులు, నాలాలను ఆక్రమించడం వల్లే వర్షాకాలంలో ప్రజలకు అసౌకర్యం కలుగుతోందన్నారు. నాలాలపై అక్రమ కట్టడాలను తొలగిస్తున్నామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆక్రమణలు తొలగించి నాలాల విస్తరణ పనులు చేపట్టామని పేర్కొన్నారు. చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో వచ్చే వర్షాకాలం నాటికి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

గతేడాది 43 లక్షల 61 వేల క్యూబిక్ మీటర్ల పూడిక తీస్తే.. ఈ ఏడాది 75 లక్షలకు పైగా క్యూబిక్ మీటర్ల లోతు పూడిక తీశామని కేటీఆర్ తెలిపారు. నాలాల పూడికతీత సరిగ్గా జరుగుతుందా? లేదా? అనే విషయంపై ఇంటర్నల్‌గా ఆడిట్ చేశామన్నారు. ఈ విషయంలో పని చేయని ఇంజినీర్లు, సిబ్బందిపై కేసులు నమోదు చేశామన్నారు. జీహెచ్‌ఎంసీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని గుర్తుచేశారు. నాలాల్లో పూడికతీతకు ఎయిర్‌టెక్ మిషన్లు తెచ్చామని గుర్తు చేశారు. కిర్లోస్కర్ సూచనలు అమలు చేయాలంటే రూ.12 వేల కోట్ల ఖర్చు, 28 వేల కట్టడాలను కూల్చాల్సి వస్తుందన్నారు.

రోడ్ల నిర్వహణకు 400 మంది ఇంజినీర్లను అదనంగా తీసుకున్నామని.. త్వరలోనే వారు జీహెచ్‌ఎంసీలో పని ప్రారంభించబోతున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. మెట్రో రైలు రూట్‌లో వర్షపు నీరు నిలవకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నాచారం నాలా అభివృద్ధికి రూ. కోటి 55 లక్షలు కేటాయించామన్నారు. దీనికి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి అయిందన్నారు. వీటి పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని మంత్రి స్పష్టం చేశారు. త్వరలోనే జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశం జరుపుతామని మంత్రి కేటీఆర్ చెప్పారు.