మీ రాక కోసం ఎదురుచూస్తున్నాం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకాకు ప్రధాని మోడీ ట్విట్టర్‌ లో స్వాగతం పలికారు. హైదరాబాద్‌లో ఈ నెలాఖరున జరగనున్న ఇంటర్నేషనల్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌ లో పాల్గొనేందుకు ఇవాంక భారత్‌ రానున్నారు. ఈ నేపథ్యంలో పది రోజుల ముందే ఆమెకు స్వాగతం పలుకుతూ ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు. మీ రాకతో రెండు దేశాల ఆర్థికబంధం బలపడుతుందని నమ్ముతున్నా అని పేర్కొన్నారు. భారత్‌లో నైపుణ్యం, సృజనాత్మకత ఉన్న ప్రజలకు అమెరికాలో అవకాశాలు లభిస్తాయి. యువ వాణిజ్యవేత్తలకు మంచి జరుగుతుంది. మీ రాక కోసం ఎదురుచూస్తున్నాం అని మోడీ ట్వీట్‌ చేశారు. ప్రధాని మోడీతో కలిసి ప్రపంచంలోని అత్యుత్తమ వాణిజ్యవేత్తలను కలుసుకునేందుకు వెళుతున్నానని ఇవాంకా పెట్టిన మెసేజ్‌ కు ప్రధాని మోడీ సమాధానంగా ట్వీట్‌ చేశారు.