మారనున్న హైదరాబాద్ ముఖ చిత్రం

మల్టీలెవల్ ఫ్లైఓవర్లు, జంక్షన్లు, స్కైవేల నిర్మాణంతో మరికొద్ది రోజుల్లోనే హైదరాబాద్‌ సిటీ ముఖచిత్రమే మారిపోనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, జంక్షన్ల పనులు జెట్‌ స్పీడ్‌లో సాగుతున్నాయి. రోడ్ల అభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం.. ఎస్సార్డీపీ కింద మరో రూ.17,843 కోట్లు కేటాయించి రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది.

నగరంలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు 202 నంబర్ జాతీయ రహదారిపై అంబర్‌పేట వద్ద నాలుగు లేన్ల ఫ్లైఓవర్‌తో పాటు ఇరువైపులా రెండు సర్వీస్ రోడ్ల నిర్మాణానికి రూ.338 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. ఇందులో భూసేకరణకు రూ.229 కోట్లు, ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.111.71 కోట్ల అంచనాతో ప్రతిపాదనలను రోడ్లు భవనాల శాఖ కేంద్రానికి పంపించింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఈ ఫ్లైఓవర్ ప్రతిపాదనల అనుమతి కోసం ఇప్పటికే కేంద్రాన్ని కోరారు. గోల్నాక కూడలి వద్ద ఉన్న సేలం బైబిల్ చర్చి వద్ద ఈ ఫ్లైఓవర్ ప్రారంభమై.. అంబర్‌పేట మార్కెట్ ముకరం హోటల్ దగ్గర ముగుస్తుంది. దీని నిర్మాణానికి 4.26 ఎకరాల భూ సేకరణ అవసరమవుతుందని అంచనా వేశారు అధికారులు.

అటు హైదరాబాద్‌లోని ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ జంక్షన్ల వద్ద నిర్మించనున్న మూడు ఎలివేటెడ్ కారిడార్లతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడనుంది. నిత్యం ట్రాఫిక్ సమస్యలతో ప్రజాజీవనం అతలాకుతలమవుతున్న నేపథ్యంలో ఈ కారిడార్లు ఎంతో ఉపయోగకరంగా నిలువనున్నాయి. వీటికిగానూ రూ. 1400 కోట్లు ఖర్చు చేయనున్నారు. నగరంలోని అన్ని రహదారులు 9204.15 కిలోమీటర్లు ఉండగా.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 9103.35 కిలోమీటర్లు, రోడ్లు భవనాల శాఖలో జాతీయ రహదారుల విభాగం పరిధిలో 84.50 కిలోమీటర్లు, రాష్ట్ర రహదారుల విభాగం పరిధిలో 16.3 కిలోమీటర్లుగా ఉన్నాయి. వీటన్నింటినీ దశల వారీగా అభివృద్ధి చేసేందుకు ప్రదిపాదనలు రెడీ చేసింది సర్కార్‌.