మాజీ డీజీపీ అనురాగ్ శర్మకు ఘనంగా వీడ్కోలు

శాంతి భద్రతల పరిరక్షణ, పోలీసింగ్ లో కొత్త విధానాల అమలులో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ గా నిలవడం గర్వకారణమన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో గొప్ప రక్షణ వ్యవస్థగా పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దడానికి అనురాగ్ శర్మ శ్రమించారని ప్రశంసించారు. డీజీపీగా ఆదివారం పదవీ విరమణ చేసిన ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అనురాగ్ శర్మను ఘనంగా సన్మానించారు.

తెలంగాణ తొలి డీజీపీ అనురాగ్ శర్మ నాయకత్వంలో రాష్ట్ర పోలీసు వ్యవస్థ దేశవ్యాప్తంగా మంచిపేరు తెచ్చుకుంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రోత్సాహంతో డీజీపీగా ఆయన ఎన్నో సంస్కరణలు చేపట్టారు. డిపార్ట్ మెంటులో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టిన అనురాగ్ శర్మ డీజీపీ పదవీకాలం గత ఆదివారం ముగిసింది. ఈ నేపథ్యంలో అత్యుత్తమ పనితీరుతో అందరి మనసు గెలుచుకున్న అనురాగ్ శర్మకు రాష్ట్రప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందనే అపోహలను, దుష్ప్రచారాన్ని పటాపంచలు చేశారు పోలీసులు. అందుకే తెలంగాణను సహనశీల రాష్ట్రంగా ఆవిష్కరించిన ఘనత పోలీసు శాఖకు దక్కుతుందన్నారు సీఎం కేసీఆర్. మూడున్నరేళ్ల పాటు డిజిపిగా పనిచేసి పోలీసులకు నాయకత్వం వహించిన అనురాగ్ శర్మకు ఈ ఘనత దక్కుతుందని అభినందించారు. శాంతి భద్రతల పరిరక్షణ, పోలీసింగ్ లో కొత్త విధానాల అమలులో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ గా నిలవడం గర్వకారణమన్నారు. తెలంగాణలో పోలీసులు కేవలం తమ విధి నిర్వహణకే పరిమితం కాకుండా అనేక సామాజిక బాధ్యతలను కూడా నెరవేరుస్తున్నారని ప్రశంసించారు సీఎం కేసీఆర్.

తెలంగాణ ఏర్పడిన కొత్తలో సంక్లిష్ట పరిస్థితుల్లో గొప్ప రక్షణ వ్యవస్థగా పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దడానికి అనురాగ్ శర్మ శ్రమించారని మెచ్చుకున్నారు సీఎం కేసీఆర్. ఇది చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. మానవ ప్రవృత్తిలో చంచలత్వం ఉన్నంతకాలం భూమిపై శాంతి భద్రతల సమస్య ఉంటుందన్నారు. కాబట్టి శాంతి భద్రతల నిర్వహణ నిరంతర ప్రక్రియ, ఎంత తెలివితో, సమన్వయంతో, కొత్త ఆలోచనలతో విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. వినూత్నంగా ఆలోచించి కొత్త విధానాలు నెలకొల్పడానికి, కొత్త ప్రయోగాలు చేయడానికి ఆకాశమే హద్దు అన్నారు.

తెలంగాణ పోలీసులు అనేక కొత్త విధానాలు తెచ్చారని ముఖ్యమంత్రి మెచ్చుకున్నారు. షి టీమ్స్ ఏర్పాటు, నగరంలో లక్షకు పైగా సిసి కెమెరాలు ఏర్పాటు, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో తెలంగాణ పోలీసులు ప్రశంసనీయమైన పాత్ర పోషించారని చెప్పారు. స్వచ్ఛ హైదరాబాద్, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాల్లో కూడా భాగస్వాములై సామాజిక బాధ్యతను నెరవేర్చారని ప్రశంసించారు. గోదావరి, కృష్ణ పుష్కరాల నిర్వహణలో అలుపెరగని కృషి చేశారని తెలిపారు. ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులతో మంచి సమన్వయంతో పనిచేశారని అన్నారు. ఇది డిజిపిగా అనురాగ్ శర్మ అందించిన నాయకత్వం, సమన్వయం వల్లే సాధ్యమైందన్నారు సీఎం కేసీఆర్.

తెలంగాణ ప్రాంతం చరిత్రలో ఎన్నడూ కూడా గడిచిన మూడున్నరేళ్లున్నంత ప్రశాంతంగా లేదు. ఎప్పుడూ ఏదో ఒక అలజడి ఉండేదన్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీ సమావేశాల్లో కూడా గతంలో పోలీసు శాఖపై ఆరోపణలు ప్రధాన ఎజెండాగా ఉండేది. కాని తెలంగాణ పోలీసులు పరిస్థితిని మార్చేశారని చెప్పారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోలీసుల పనితీరును చూసి ఓటేయండి అని కూడా అడిగామని గుర్తు చేశారు. ఈ సందర్భం గతంలో ఎన్నడూ లేదు. తెలంగాణ పోలీసులు కేవలం రాష్ట్ర పరిధిలో శాంతిభద్రతలు పర్యవేక్షించడంలోనే కాదు, తెలంగాణ పోలీసులు నేరాల నియంత్రణకు చేసిన నిరంతర కృషి దేశ రక్షణకు కూడా ఉపయోగపడిందన్నారు. తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, తెలంగాణ గ్రే హౌండ్స్ పనితీరు అద్భుతమని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు, ఇతర మంత్రులు చెప్పినప్పుడు తన గుండె ఉప్పొంగిందన్నారు. రిటైర్ అయిన డిజిపి అనురాగ్ శర్మ, డిజిపిగా నియమితులైన మాజీ సిటి పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి కృషి కారణంగానే ఇది సాధ్యమైందన్నారు సీఎం కేసీఆర్.

అనురాగ్ శర్మ అనుభవాన్ని, అవగాహన శక్తిని దృష్టిలో ఉంచుకునే పోలీసు శాఖకు, ప్రభుత్వానికి ఉపయోగపడతారని హోంశాఖ సలహాదారుడిగా నియమించామన్నారు సీఎం కేసీఆర్. కొత్త డిజిపి మహేందర్ రెడ్డి ఓపిక, కార్యదక్షత, లక్ష్యసిద్ది కలిగిన అధికారి అని కితాబిచ్చారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ పోలీసు శాఖ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుందన్నారు. దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిన తెలంగాణ పోలీసులు ప్రపంచంలోనే గొప్ప పోలీసుగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు సీఎం కేసీఆర్.

తనకు ఘనమైన వీడ్కోలు లభించడంపై అనురాగ్ శర్మ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఏ డిజిపికి కూడా ఇంతటి స్థాయిలో వీడ్కోలు జరగలేదన్నారు. ఇది తనకొక్కడికే కాకుండా పోలీసుశాఖకు జరిగిన సన్మానంగా భావిస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి మాట ప్రకారం.. ఇతర పోలీసు అధికారులందరి సహకారంతో మూడున్నరేళ్ల పాటు విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించడం సంతృప్తిగా, సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ విజన్ చాలా గొప్పదన్నారు. దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని అన్నారు.

ఆత్మీయ వీడ్కోలు సందర్భంగా అదనపు డిజి అంజనీ కుమార్ వందన సమర్పణ చేశారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదితో పాటు ఇతర అధికారులు కూడా అనురాగ్ శర్మను అభినందించారు.

డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, పోచారం శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, డిజిపి మహేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.