మహిళా పారిశ్రామికవేత్తలకు జీఈఎస్ లో ప్రాధాన్యం

హైదరాబాద్ లో రేపటి నుంచి మూడు రోజులపాటు జరిగే గ్లోబల్ ఆంట్రప్రెన్యూర్ షిప్ సమ్మిట్ మహిళా పారిశ్రామికవేత్తలకు ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ సదస్సులో మహిళా పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని తెలిపారు. జీఈఎస్ నేపథ్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రోడ్ టు జీఈఎస్-గెట్ ఇంటూ ద రింగ్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. జీఈ సదస్సు నిర్వహించడానికి దేశంలోని 8 రాష్ట్రాలు  పోటీ పడినా.. ఈ అవకాశం తెలంగాణకే వచ్చిందన్నారు. జీఈ సదస్సులో ప్రధాన మంత్రి మోడీ అనేక అంశాలపై ప్రసంగించనున్నారని కేటీఆర్ చెప్పారు. మూడు రోజుల పాటు అనేక అంశాలపైన ప్యానల్ డిస్కషన్స్ ఉంటాయన్నారు. ప్రపంచంలోని దాదాపు 150 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారని వివరించారు.

జీఈ సదస్సులో పోటీ పడేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి వంద స్టార్టప్ లు పోటీ పడ్డాయి. వాటి నుంచి ఆరు స్టార్టప్ లు పోటీకి నిలిచాయి.