మంత్రి కేటీఆర్ తో జపాన్ ప్రతినిధుల భేటి

రాష్ర్టంలో వాయు కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు పోతున్నదని పురపాలక శాఖ మంత్రి కె.టి. రామారావు తెలిపారు. హైదరాబాద్ లోని  మెట్రో రైలు భవన్లో జపాన్ ఎక్స్ టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెట్రో), క్లీన్ అథారిటీ ఆఫ్ టోక్యో ప్రతినిధులతో మంత్రి సమావేశం అయ్యారు.

తెలంగాణ ప్రభుత్వం నూతన టెక్నాలజీలను అందిపుచ్చుకునేందుకు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని తెలిపిన మంత్రి కేటీఆర్, వాయు కాలుష్య నివారణలోనూ అధునాతన పద్ధతులను అవలంభించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ మేరకు ఈ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించిన జపాన్ అనుభవాలను ఉపయోగించుకునేందుకు రెడీగా ఉన్నామని  జపాన్ ప్రతినిధి బృందానికి మంత్రి తెలిపారు. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పెద్ద నగరాల్లో ఎయిర్ క్వాలిటీని పెంచేందుకు, ఇక్కడి పరిస్ధితులను అధ్యయనం చేసి ఒక నివేదిక ఇవ్వాలని వారిని కోరారు. చెత్త ట్రీట్ మెంట్ ప్లాంట్ల ఏర్పాటు, వేస్ట్ టు ఎనర్జీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ పద్ధతులు, స్పాట్ ఇన్సినరేషన్ ప్లాంట్ల ఏర్పాటు వంటి అంశాలపైన జపాన్ సహకారం తీసుకుంటామన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నగరంలోని అతి కాలుష్య కారక పరిశ్రమలను అవుటర్ రింగ్ రోడ్డు అవతలకు పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు, అక్కడ నూతనంగా ఏర్పాటు చేయనున్న పరిశ్రమల్లో అత్యుత్తమ కాలుష్య నియంత్రణ పద్ధతులను అనుసరించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. దీంతోపాటు నూతనంగా ఏర్పాటు చేయనున్న ఫార్మసిటీ వంటి ప్రాజెక్టుల్లో కాలుష్య నియంత్రణకు చేపడుతున్న అంతర్జాతీయస్ధాయి ప్రమాణాలతో కూడిన పద్ధతులను మంత్రి వారికి వివరించారు.

తమ ప్రభుత్వ ప్రతినిధి బృందం ఇప్పటికే వాయు కాలుష్య నియంత్రణ, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ పద్ధతుల అధ్యయనానికి జపాన్ లో పర్యటించిందని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. తమ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఇక్కడ పరిస్ధితులను అధ్యయనం చేసేందుకు వచ్చిన జపాన్ బృందం ఇక్కడ మూడు రోజుల పాటు పర్యటించనున్నట్లు తెలిపారు. వీరు బీబీ నగర్ పవర్ ప్లాంట్, జవహర్ నగర్ డంప్ యార్డ్ సందర్శించనున్నారు. తమ పర్యటనలో వీరు హైదరాబాద్, వరంగల్ నగరాల్లో పర్యటించి, ఇక్కడి పరిస్ధితులకు అనుగుణంగా సాలిడ్ వేస్ఠ్ మేనేజ్ మెంట్, వాయు కాలుష్య నియంత్రణ పద్దతులపైన ఒక నివేదిక ఇస్తారని తెలిపారు.

జపాన్ ప్రతినిధి బృందం సభ్యులు తమ దేశంలో పాటిస్తున్న పద్ధతులను సమావేశంలో వివరించారు. ముఖ్యంగా టోక్యో క్లీన్ ఎయిర్ అథారిటీ ఆధ్యర్యంలో చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించిన జపాన్ ప్రతినిధి బృందం, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న క్లీన్ ఎయిర్ అథారిటీకి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.

ఈ సమావేశంలో మంత్రి కె.టి. రామారావు తోపాటు పురపాలక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, సిడిఎంఎ, ఈపిటిఈఆర్ఐ అధికారులు పాల్గొన్నారు.