మండలిలో ప్రశ్నోత్తరాలు-మంత్రుల సమాధానాలు

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు డిప్యూటీ సీఎం మహమ్మద్‌ మహమూద్‌ అలీ. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయన్నారు. అలాగే రైతులకు కొత్తగా ఈ పాస్‌ పుస్తకాలు, టైటిల్‌ డీడ్లను త్వరలోనే ఇస్తామని శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మహమూద్‌ అలీ సమాధానం చెప్పారు.

కోకాపేట భూములను ప్రభుత్వం పరిరక్షిస్తుందన్నారు డిప్యూటీ సీఎం మహమ్మూద్‌ అలీ. 633 ఎకరాల భూములను ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు అప్పగించిందన్నారు. అయితే, కొంత మంది నవాబ్‌ నుస్రంజంగ్ బహదూర్‌ వారసులమని కోకాపేట భూములు తమకే చెందుతాయంటూ హైకోర్టును ఆశ్రయించారని, వారి పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసిందని ఆయన వివరించారు.

గిరిజనుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌. రాష్ట్రంలోని మైదాన ప్రాంతాల గిరిజనుల కోసం హైదరాబాద్‌లో ఒక ఐటీడీఏ పనిచేస్తోందన్నారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాలైన ఏటూరునాగారం, ఉట్నూరు, భద్రాచలంలో కూడా ఐటీడీఏలు పనిచేస్తున్నాయన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో గిరిజనుల పాత్ర గొప్పదని మంత్రి గుర్తుచేశారు.

నిజామాబాద్‌ వైద్య కళాశాలలో 29 అసోసియేట్‌, 13 ప్రొఫెసర్‌ పోస్టులను పదోన్నతిపై భర్తీ చేశామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 23 అసోసియేట్‌, 17 ప్రొఫెసర్‌ పోస్టులను కూడా పదోన్నతిపై భర్తీ చేయాలని, కానీ అర్హత ఉన్న వాళ్లు లేకపోవడంతో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు.

కోళ్ల పరిశ్రమలో పెరుగుదల ఔషధాల వినియోగంపై తమకు ఫిర్యాదులు అందాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. ఈ ఫిర్యాదులపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో చర్చిస్తామన్నారు. తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ఔషధాల వాడకంపై ప్రభుత్వం ఒక టాస్క్‌ఫోర్స్‌ ను నియమిస్తుందని తలసాని వెల్లడించారు.

గీత కార్మికుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆబ్కారీ, మద్య నిషేధ శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. తాటి చెట్లు ఎక్కేందుకు మిషన్ల ఉపయోగంపై అధ్యయనానికి కమిటీని కేరళ, తమిళనాడు పంపినట్లు తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించి లైసెన్సులను ఆటోమెటిక్ రెన్యువల్‌ చేసే విధానాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది రెండు కోట్ల ఈత, తాటి మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకున్నట్టు వెల్లడించారు.