మండలిలో ప్రశ్నోత్తరాలు-మంత్రుల సమాధానాలు

ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు స్పష్టం చేశారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం సర్కార్ తీసుకుంటున్న చర్యలను శాసనమండలిలో వివరించారు. క్వశ్చన్ అవర్ లో భాగంగా స్వపక్ష, విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సవివరంగా సమాధానాలు ఇచ్చారు. రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ పాఠశాలలు, పంచాయతీరాజ్ వ్యవస్థతో పాటు తదితర అంశాలను సభ్యులు ప్రస్తావించారు. వాటన్నింటికీ మంత్రులు సావధానంగా సమాధానమిచ్చారు.

హైదరాబాద్ నగరంలో ఆటోల ఫిట్ నెస్ పై కఠినంగా వ్యవరిస్తున్నామన్నారు రవాణ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి. హైదరాబాద్ లో ఆటో మీటర్ల ట్యాంపరింగ్ కు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసినమని తెలిపారు. ఎప్పటికప్పుడు తూనికలు-కొలతలు, రవాణ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నమని చెప్పారు.  అటు ట్రాఫిక్ కు ఇబ్బందులు తలెత్తకుండా ముంబై తరహలో క్యూ సిస్టమ్ ఏర్పాటు చేస్తమన్నారు.

పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి కొత్త చట్టం తీసుకొస్తున్నట్లు పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది జనాభా అంతకంటే ఎక్కువగా ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తిస్తామని వెల్లడించారు. అంతకంటే తక్కువగా ఉన్న ప్రాంతాలన్నింటిని కలిపి క్లస్టర్‌గా మారుస్తామని మంత్రి వెల్లడించారు. అవసరానికి తగ్గట్టుగానే గ్రామ పంచాయతీల ఏర్పాటు ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.

నకిలీ ఫెస్టిసైడ్స్ విక్రయించేవారిపై కఠిన తీసుకుంటామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. పురుగు మందుల వాడకంపై రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నామన్నారు. పంటలకు స్ప్రే చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే దీనిపై అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు.

దేశంలో సోషల్ మీడియాపై చర్యలు తీసుకునేందుకు ఎలాంటి చట్టాలు లేవని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దీనిపై కేవలం క్రిమినల్ కేసులు పెట్టడం తప్ప.. మరో అవకాశం లేదన్నారు. ఈ అంశంపై కొత్త చట్టం తీసుకురావాలనే ఆలోచనను పరిశీలిస్తామన్నారు. దీంతో పాటుగా రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.