మండలిలో ప్రశ్నోత్తరాలు-మంత్రుల సమాధానాలు

ప్రజా సంక్షేమమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు స్పష్టం చేశారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం సర్కార్ తీసుకుంటున్న చర్యలను శాసనమండలిలో వివరించారు. క్వశ్చన్ అవర్ లో భాగంగా స్వపక్ష, విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సవివరంగా సమాధానాలు ఇచ్చారు.

రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పట్టాల కోసం మొత్తం 3లక్షల 44వేల 226 దరఖాస్తులు వచ్చాయన్నారు డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ. అందులో 1లక్షా 25వేల 854 దరఖాస్తుదారులకు పట్టాలు ఇచ్చామన్నారు. 94వేల 439 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 1లక్షా 3వేల 331 దరఖాస్తులను తిరస్కరించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.

హైదరాబాద్‌లో మన కూరగాయల సెంటర్లను వందకు పెంచుతామని మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. రైతు బజార్లలో దళారుల నివారణకు ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. పెద్దపల్లిలో కూడా రైతుబజార్ నిర్మాణం చేపడతామన్నారు. రాష్ట్రంలో 28 కొత్త రైతుబజార్లను ఏర్పాటు చేశామన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ఇరిగేషన్‌ రంగంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు స్వర్ణయుగం వచ్చిందన్నారు మంత్రి హరీష్‌రావు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 2లక్షల 43వేల 865 ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. అలాగే జిల్లాలో కొత్తగా 46 చెరువులను తవ్వనున్నట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు.

సీఎం కేసీఆర్‌ కార్మికుల పక్షపాతి అన్నారు హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి. కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పరిపాలనా సౌలభ్యం, సులభతర వాణిజ్యం కోసమే ప్రభుత్వం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ విధానాన్ని అవలంభిస్తోందన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో రాష్ట్రానికి ప్రథమ ర్యాంకు రావడంలో కార్మిక శాఖ కృషి ఎంతో ఉందన్నారు నాయిని.

హైదరాబాద్‌లో సైబర్‌ నేరాల కట్టడికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి. అందుకోసం అధునాతనమైన టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు  తెలిపారు. ముంబై, ఢిల్లీ తరహా విధానాలను హైదరాబాద్‌లో అనుసరిస్తామన్నారు.

కేంద్ర ప్రభుత్వం విధించిన గడువులోపు పౌర సరఫరాల శాఖలో ఆధార్ అనుసంధానం ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు మంత్రి ఈటెల రాజేందర్‌. సంక్షేమ పథకాల అమలుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఆధార్ అనుసంధానాన్ని పూర్తిచేస్తామన్నారు. ప్రభుత్వ పథకాలకు ప్రస్తుతం ఆధార్ లింక్‌ తప్పనిసరి కాదని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పౌర సరఫరాల శాఖలో కీలక సంస్కరణలు తీసుకొచ్చినట్లు మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. రేషన్ సరకులు అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన వారిపై పీడీయాక్ట్‌తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. అటు డీలర్ల కమీషన్ పెంపు విషయం కూడా సీఎం కేసీఆర్ పరిశీలనలో ఉందన్నారు ఈటెల.

ప్రభుత్వం తీసుకున్న చర్యలతో హైదరాబాద్‌, ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్‌ వ్యాధులు కంట్రోల్‌ అవుతున్నాయన్నారు వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి. వ్యాధుల నివారణకు ప్రభుత్వం మూడంచెల విధానాలను అనుసరిస్తుందన్నారు. సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.

మంత్రుల వివరణపై స్వపక్ష, విపక్ష సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చూపుతున్న చొరవపై సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.