భారత్-కివీస్ చివరి టీ20 నేడే

భారత్‌ లో న్యూజిలాండ్‌ పర్యటన చివరి దశకు చేరింది. టీ ట్వంటీ సిరీస్‌ ఫలితం తేల్చే  చివరి మ్యాచ్‌.. ఇవాళ తిరువనంతపురంలో జరగనున్నది. గత కొన్నేళ్లలో సొంతగడ్డపై టీమిండియాను  తీవ్రంగా ఇబ్బంది పెట్టిన విదేశీ జట్టుగా కివీస్‌కు పేరుంది.

ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా లాంటి జట్లను ఓడించిన టీమిండియా.. న్యూజిలాండ్‌ చేతిలో పలు సార్లు ఓటమి పాలైంది. తాజాగా జరిగిన వన్డే సిరీస్‌ కూడా హోరాహోరీగా సాగింది. చివరి మ్యాచ్‌లో నెగ్గి టీమిండియా వన్డే సిరీస్‌ ను కైవసం చేసుకున్నది. ఇప్పుడు టీ ట్వంటీ సిరీస్‌ లోనూ ఇరు జట్లు చెరో మ్యాచ్‌  గెలిచి 1-1 తో  సమఉజ్జీలుగా  నిలిచాయి. ఇవాళ తిరువనంతపురంలో జరిగే చివరి టీ ట్వంటీలో ఎలాగైనా గెలిచి.. టీ ట్వంటీ సిరీస్‌ ను కైవసం చేసుకోవాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి.

టీమిండియా షార్ట్‌ ఫార్మాట్‌లో.. న్యూజిలాండ్‌ ను ఎదుర్కొనడానికి తీవ్రంగా  ఇబ్బందులు పడుతున్నది. ఇతర జట్లను ఈజీగా ఓడించిన కోహ్లీ సేనకు.. కివీస్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. అతికష్టం మీద వన్డే సిరీస్‌ ను నెగ్గిన భారత్‌.. టీ ట్వంటీ సిరీస్‌ ఫలితం తేల్చే ఆఖరి మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే కసితో ఉన్నది. ఇప్పటికే ఇరు  జట్లు చెరో మ్యాచ్‌లో భారీ తేడాతో  గెలుచుకోవడంతో.. ఈ మ్యాచ్‌ ఫలితంపై ఆసక్తి నెలకొన్నది. న్యూజిలాండ్‌ కూడా.. టీమిండియాపై టీ ట్వంటీ సిరీస్‌ గెలిచి.. తాము టీ ట్వంటీ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌ లో ఎందుకు నెంబర్‌ వన్‌ పొజిషన్‌ లో ఉన్నామో మరోసారి నిరూపించాలనే పట్టుదలతో ఉన్నారు.

గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే న్యూజిలాండ్‌ ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగే అవకాశాలుండగా.. భారత్ మాత్రం తుది జట్టులో మార్పులు చేసే ఛాన్స్‌ ఉన్నది. హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌కు మరో ఛాన్స్‌ దొరుకుతుందా.. లేదా  అన్నది ప్రశ్నగా మారింది. బ్యాటింగ్‌ ను బలోపేతం చేయాలనుకుంటే.. సిరాజ్‌ స్థానంలో మరో బ్యాట్స్‌ మెన్‌ ను టీమ్‌ లోకి తీసుకొనే అవకాశమున్నది. అటు గత మ్యాచ్‌లో స్లోగా ఆడాడని ధోని పై విమర్శలు చేలరేగడంతో.. ఈ  మ్యాచ్‌లో మాజీ  కెప్టెన్‌ ధోని ఎలా ఆడతాడన్నది ఆసక్తికరంగా మారింది. ఇక పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించవచ్చని.. కనీసం 180 రన్స్‌  కంటే ఎక్కువ స్కోర్స్‌ నమోదు కావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు వరుణుడి నుంచి మూడో టీ ట్వంటీకి ముప్పు ఉండే ప్రమాదం ఉన్నది. తిరువనంతపురంలో వర్షం పడుతుండటంతో అధికారులు  స్టేడియాన్ని  కవర్లతో  కప్పి  ఉంచారు. ఎంత భారీ వర్షం పడినా.. నిలిచిన అరగంట లోపే మ్యాచ్‌కు స్టేడియాన్ని సిద్ధం చేసే అవకాశాలున్నాయి. దేశంలోనే మంచి డ్రైనేజీ వ్యవస్థ కలిగిన  స్డేడియంలలో  తిరువనంతపురం ఒకటి కావడంతో.. మ్యాచ్‌ కు ఎలాంటి ఆటంకం కలగదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.