భాగ్యనగరానికి మరింత విరివిగా నీళ్లు

భాగ్యనగర ప్రజల తాగునీటి కష్టాలకు చెక్‌ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. త్వరలో హైదరాబాద్‌ లోని ప్రతీ ఇంటికి నల్లా ద్వారా స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయనుంది. ఈ లక్ష్యంతో చేపట్టిన పట్టణ మిషన్‌ భగీరథ ఫలాలు విరివిగా అందుతున్నాయి. ఇప్పటికే ఏడు చోట్ల భారీ స్టోరేజీ రిజర్వాయర్లను ప్రారంభించి ప్రజల గొంతును తడిపిన జలమండలి.. ఈ నెల 26న గడ్డి అన్నారం, ఎల్బీనగర్‌ తదితర సర్కిళ్ల పరిధిలో మరో 20 రిజర్వాయర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మంత్రులు కేటీఆర్‌, మహేందర్‌ రెడ్డిల చేతుల మీదుగా ఒకేచోట నుంచి వీటిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ తర్వాత సంబంధిత నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు రిజర్వాయర్లను ప్రారంభిస్తారు.

జీహెచ్‌ఎంసీలో విలీనమైన శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, అల్వాల్‌, కాప్రా, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆర్‌సీ పురం, పటాన్‌ చెరు కలిపి 10 మున్సిపల్ సర్కిళ్ల ప్రజల దాహార్తికి శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం రూ.1900 కోట్ల హడ్కో నిధులతో తాగునీటి ప్రాజెక్టును చేపట్టింది. రోజూ 146 మిలియన్‌ గ్యాలర్ల నీటిని సరఫరా చేయడంతో పాటు కొత్తగా లక్ష నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నారు. దీంతో 35 లక్షల మందికి రక్షిత తాగునీరు అందనుంది. ఈ మేరకు 1800 కిలోమీటర్ల పైప్‌లైన్‌, 56 చోట్ల భారీ స్టోరేజీ రిజర్వాయర్లను ఏర్పాటు చేయాలని జలమండలి నిర్ణయించింది. ఈ మేరకు పనులు ప్రారంభించిన అధికారులు పైప్‌ లైన్‌ విస్తరణలో 1351 కిలోమీటర్ల మేర రికార్డు సమయంలో పూర్తి చేశారు.

వర్షాల నేపథ్యంలో పనులకు తాత్కాలిక విరామం ప్రకటించారు. వర్షాకాలం ముగియడంతో జలమండలి ఎండీ దానకిషోర్‌ రెండు రోజులుగా సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులతో డిసెంబర్‌ నాటికి పథకం పూర్తి చేసేలా కార్యాచరణ ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న 349 కిలోమీటర్ల పైప్‌ లైన్ విస్తరణ పనుల్లో వారానికి 30 నుంచి 43 కిలోమీటర్ల చొప్పున పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో డిసెంబర్‌ నెలాఖరు నాటికి పట్టణ భగీరథ పథకం పూర్తి ఫలాలు ప్రజలకు అందనున్నాయి.

56 రిజర్వాయర్ల పనుల్లో కౌకూర్‌ మినహా మిగతా చోట్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఏడు రిజర్వాయర్లు అందుబాటులోకి వచ్చాయి. సాహెబ్ నగర్‌, వైదేహినగర్‌, ప్రశాంత్‌ నగర్‌, రైతు బజార్‌, తదితర ప్రాంతాల్లో రిజర్వాయర్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 20 రిజర్వాయర్లను ఈ నెల 26న ప్రారంభించి సమీప ప్రాంతాలకు తాగునీరు అందిస్తారు.