బ్రాండ్ హైదరాబాద్

400 ఏళ్ల చరిత్ర కలిగిన నగరం. డైనమిక్‌ సిటీల్లో ప్రపంచంలో ఐదో స్థానం. ఆధునికతను అందిపుచ్చుకుంటూనే టెక్నాలజీపరంగానే కాదు.. జీవన ప్రమాణాల విషయంలోనూ సరికొత్త ఒరవడి సృష్టిస్తోంది. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు ఆతిధ్యం ఇస్తూ ప్రపంచదేశాలను రారమ్మంటూ ఆహ్వానిస్తోంది. రవాణా రూపురేఖల్ని మార్చే మెట్రో రైల్‌ను మణిహారంగా మార్చుకుని సగర్వంగా ఉనికి చాటుకుంటోంది మన హైదరాబాద్‌.

యావత్‌ భారతమే కాదు.. ప్రపంచ దేశాలు సైతం ఇప్పుడు హైదరాబాద్‌వైపే చూస్తున్నాయి. ఒకవైపు ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు… మరోవైపు పట్టాలపై పరుగులు పెట్టనున్న మెట్రో రైలుతో అంతర్జాతీయ వేదికపై బ్రాండ్‌  హైదరాబాద్‌ మరోసారి సగర్వంగా తన ఉనికి చాటుకుంటోంది. జీఈ సమ్మిట్‌తో పాటు మెట్రో ప్రారంభోత్సవం హైదరాబాద్‌ చరిత్రలో మరో మైలురాయిగా నిలవబోతున్నాయి. టెక్నాలజీ హబ్‌గా, స్టార్టప్‌ల వరప్రదాయినిగా, మెరుగైన జీవన ప్రమాణాలకు నిలయమైన భాగ్యనగరం.. ప్రభుత్వ చొరవ, సీఎం కేసీఆర్‌ చిత్తశుద్ధితో విశ్వనగరం దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది.

ప్రపంచంలో టాప్‌ థర్టీ డైనమిక్‌ సిటీల్లో హైదరాబాద్‌ది ఐదో స్థానం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాప్‌ – 11 సహా గత మూడేళ్లలో ఎన్నో ప్రపంచస్థాయి సదస్సులకు హైదరాబాద్‌ నగరం ఆతిధ్యమిచ్చింది. తాజాగా గ్లోబల్‌ ఎంట్రప్రెన్యూర్‌ సమ్మిట్‌కు సైతం వేదికగా మారడం భాగ్యనగర బ్రాండ్‌ ఇమేజ్‌ను మరింత పెంచింది. అన్ని రంగాల్లో గ్లోబల్‌ ఇన్వెస్టర్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కలిసి చర్చించే అరుదైన అవకాశాన్ని హైదరాబాద్‌ నగరం  కల్పిస్తోంది. అభివృద్ధిలో దూసుకుపోతున్న తీరు, ఆహ్లాదకరమైన వాతావరణం, కార్పొరేట్‌ హంగులతో మీటింగ్‌ హాళ్లు, చక్కటి ఆతిధ్యం అన్నింటినీ మించి భద్రత విషయంలో పూర్తి భరోసా హైదరాబాద్‌ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసింది.

హైదారాబాద్‌ కేంద్రంగా ఇప్పటికే 130కిపైగా అమెరికన్‌ కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌, యాపిల్‌, ఫేస్‌బుక్‌, ఉబర్‌ వంటి సంస్థలు కోరి మరీ హైదరాబాద్‌ను డెస్టినేషన్‌గా ఎంచుకున్నాయి. ముఖ్యంగా ఐటీ, డిఫెన్స్‌, ఏరోనాటిక్స్‌, బయోటెక్‌, ఫార్మా రంగాల్లో హైదరాబాద్‌ దూసుకుపోతోంది. తాజాగా GE సమ్మిట్‌తో అమెరికాతో పాటు సదస్సులో భాగస్వాములవుతున్న దేశాలు సైతం హైదరాబాద్‌లో పెట్టుబడులకు ముందుకొచ్చే అవకాశాలు కోకొల్లలుగా ఉన్నాయి.

ఇక హైదరాబాద్‌ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేయనుంది మెట్రో రైల్‌. ఇన్ఫోటెక్‌ హబ్‌గా రూపాంతరం చెందిన హైదరాబాద్‌ నగరానికి మెట్రో మరిన్ని వన్నెలద్దనుంది. ఒక్క మాటలో చెప్పాలంటే భాగ్యనగరాన్ని పీపుల్‌ ఫ్రెండ్లీ గ్రీన్‌ సిటీగా మార్చేయనుంది. ప్రపంచంలోనే అత్యాధునిక మెట్రో హైదరాబాద్‌ సొంతం. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా మోడ్రన్‌ టెక్నాలజీని మన మెట్రోలో ఉపయోగించారు. హైదరాబాద్‌ మెట్రోలో ఎస్కలేటర్ నుంచి సీసీ కెమెరాల దాకా ఆద్యంతం అద్భుతాలే.

పీపీపీ పద్దతిలో కట్టిన మెట్రో ప్రాజెక్ట్‌ నిజానికో ఇంజనీరింగ్‌ అద్భుతం. అందుకే ప్రపంచదేశాలన్ని మన మెట్రో గమనాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి. దేశంలోని మిగతా మెట్రో రైలు ప్రాజెక్టులతో పోలిస్తే హైదరాబాద్‌ మెట్రోలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కమ్యూనికేషన్‌ టెక్నాలజీని ఇక్కడ వాడుతున్నారు. దేశంలో ఇప్పటి వరకు ఉపయోగించని కమ్యూనికేషన్‌ బేస్డ్‌ ట్రైన్‌ కంట్రోల్‌ ద్వారా రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. డ్రైవర్‌తో అవసరంలేకుండా కమాండ్‌ కంట్రోల్‌  సెంటర్‌ నుంచే రైళ్లు నడవడం మరో స్పెషాలిటీ. ఇన్ని ప్రత్యేకతలున్న మెట్రో  హైదరాబాద్‌లో రవాణా రూపురేఖల్ని మార్చేయడంతో పాటు దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలవనుంది.

గతంలో ప్రపంచస్థాయి సదస్సులకు ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాలు మాత్రమే వేదికగా ఎంచుకునేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. హైదరాబాద్ బ్రాండ్‌ ఇమేజ్‌ కారణంగా ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు భాగ్యనగరం వైపే చూస్తున్నాయి. వచ్చే ఏడాది సైతం ఎన్నో గ్లోబల్‌ సమ్మిట్‌లకు హైదరాబాద్‌ వేదిక కానుంది. 2018 జనవరి 3 నుంచి 7 వరకు ఉస్మానియా యూనివర్సిటీలో 105వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ జరగనుంది. 10 మంది నోబెల్‌ బహుమతి గ్రహీతలు, 15వేల మంది ప్రతినిధులు, దేశంలోని వివిధ యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్లు సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్‌ రానున్నారు.

ఇక ఫిబ్రవరిలోనూ నగరం 3 అంతర్జాతీయ సదస్సులకు ఆతిధ్యం ఇవ్వనుంది. మైనింగ్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఫిక్కీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో 14 నుంచి 17 వరకు మైనింగ్‌ టుడే 2018 సదస్సు జరగనుంది. ఇక ఫిబ్రవరి 18 నుంచి 21 వరకు వరల్డ్‌ ఐటీ కాంగ్రెస్‌కు హైదరాబాద్‌ వేదికకానుండగా… మానవ పరిణామక్రమానికి మూలమైన కణంపై జరిగే బయో ఏషియా సమ్మిట్‌ 22 నుంచి 24 వరకు జరగనుంది. వెయ్యి మంది సైంటిస్టులు హాజరయ్యే ఈ సదస్సు నిర్వాహణకు చైనా సహా అనేక దేశాలు పోటీపడినా చివరకు హైదరాబాద్‌ ఈ అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది.