బ్యాంకర్ల తీరుపై ఎంపీ కవిత ఆగ్రహం

రాష్ట్ర ప్ర‌భుత్వం రుణ‌మాఫీ చేసినప్పటికీ బ్యాంకులు నిర్ల‌క్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎంపీ కవిత మండిపడ్డారు. వారి తీరు వల్లే అన్నదాతలకు సకాలంలో రుణమాఫీ జరగలేదన్నారు. నిజామాబాద్‌ లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఎంపీ కవిత పాల్గొన్నారు. స్థానిక కలెక్టరేట్ ప్రగతి భవన్‌ లో నిర్వహించిన మీటింగ్‌ లో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ కవిత, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. రైతు రుణ మాఫీ, ఇతర అంశాలపై చర్చించారు.

రైతుల పట్ల బ్యాంకర్లు చులకనగా వ్యవహరిస్తున్నారని ఎంపీ కవిత అన్నారు. బాధిత రైతులు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అర్హులైన లబ్దిదారులకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకు అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా అన్నదాతలకు అన్ని విధాలా అండగా ఉండాలని సూచించారు.

ఆ తర్వాత జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని ఉచిత భోజన వితరణ శాలలో మంత్రి పోచారం, ఎంపీ కవిత, తదితరులు భోజనం చేశారు. ఎంపీ కవిత సౌజన్యంతో భోజనశాల నిర్వహిస్తున్నారు. తర్వాత… పట్టణంలోని నాగారంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను వారు పరిశీలించారు. నిజామాబాద్‌ కలెక్టరేట్ గ్రౌండ్ లో జరిగిన మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.