బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్నాం

రాష్ట్రస్థాయిలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం కమిటీలు ఏర్పాటు చేశామని కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రెడ్‌క్రాస్, ఎన్జీవోలతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లా, మండల స్థాయిలో టాస్క్‌ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశామని ప్రకటించారు.

బాలకార్మికులను హోటళ్లు, పరిశ్రమలు, దాబాల్లో గుర్తించామని నాయిని తెలిపారు. అన్ని జిల్లాల్లో నేషనల్ చైల్డ్ సొసైటీలు ఏర్పాటు చేశామన్నారు. బాలకార్మికుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. బాల కార్మికులను నియమించుకున్న యజమానులపై 8, 874 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. యజమానుల వద్ద కార్మికుడికి రూ. 20 వేల చొప్పున వసూలు చేస్తున్నామని చెప్పారు. వసూలు చేసిన డబ్బును బాలకార్మికుల సంక్షేమం కోసం కలెక్టర్ల వద్ద డిపాజిట్ చేస్తున్నామని తెలిపారు. మూడున్నరేళ్లలో కలెక్టర్ల వద్ద రూ. 44 లక్షలు డిపాజిట్ చేశామని వెల్లడించారు. కనీస వేతనాల చట్టం కింద యజమానులపై చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నాయిని పేర్కొన్నారు.