బాలీవుడ్ కంటే మహిళల పరిశుభ్రత ప్రచారానికే ప్రాధాన్యం

బాలీవుడ్ పై ప్రస్తుతం తనకు అంత ఆసక్తి లేదని మిస్ వరల్డ్-2017 మానుషి చిల్లార్ స్పష్టం చేసింది. రుతుక్రమం సమయంలో మహిళల పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు గతంలో మిస్ వరల్డ్ గా గెలిచిన వారు చేస్తున్న కృషిలో భాగస్వామిని కావడం ఆనందం కలిగిస్తోందని చెప్పింది. ఆ కార్యక్రమంలో పాల్గొనడంపైనే తాను ఉత్సుకతతో ఉన్నానని తెలిపింది. ముంబై వచ్చిన సందర్భంగా మానుషి మీడియాతో మాట్లాడింది.

మిస్ వరల్డ్ గా ఎన్నిక కావడం కేవలం భౌతిక సౌందర్యానికి సంబంధించిన విషయమే కాదని మానుషి పేర్కొన్నది. ఆ అందాన్ని మంచి పని చేసేందుకు ఎలా ఉపయోగిస్తామన్నదే ముఖ్యమని చెప్పింది. రుతుక్రమం సమయంలో పరిశుభ్రతపై తాను ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు ఈ విషయంలో ప్రజలకు అవగాహన చాలా తక్కువగా ఉందని, కనీసం శానిటరీ నాప్ కిన్స్ కూడా సరిగ్గా అందుబాటులో లేవని మానుషి వివరించింది.

హర్యానా ప్రభుత్వం తనకు ఇచ్చిన గౌరవానికి మానుషి ధన్యవాదాలు తెలిపింది. బేటీ బచావో బేటీ పడావో ఆందోళన్ లో తాను భాగస్వామిని అవుతానని ప్రకటించింది.

బాలీవుడ్ హీరోలంతా అందంగా ఉంటారని, ఐతే అమీర్ ఖాన్ తో కలిసి పనిచేయడమంటే తనకు ఎక్కువ ఇష్టమని మానుషి చెప్పింది. అమీర్ ఖాన్ సినిమాల్లోని పాత్రలు సవాల్ లో కూడుకొని ఉంటాయని, అవి సమాజంతో కనెక్ట్ అవుతాయని వివరించింది. ఆయన సినిమాల్లో సందేశం ఉంటుందని చెప్పింది. ప్రియాంక చోప్రా తన అభిమాన నటి అని మానుషి తెలిపింది.