బట్టబయలవుతున్న కృష్ణా జలాల్లో ఏపీ మోసం

కృష్ణా జలాల విషయంలో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణలో ఏపీ ఆయకట్టు గుట్టు వీడుతోంది. క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఏపీ సాక్షి వాస్తవాలను అంగీకరిస్తూనే కృష్ణా బేసిన్‌గానే పరిగణించాలంటూ వితండ వాదన చేశారు. కళ్ల ముందు సత్యం కనిపించినా ఏపీ తీరుపై ట్రిబ్యునల్ చైర్మన్ బ్రిజేశ్ విస్మయానికి గురయ్యారు. ఇవాళ ఏపీలోని ఇతర బేసిన్లలో కృష్ణా నీటి నిల్వలపై వాదనలు జరగనున్నాయి.

ఒకటా.. రెండా.. దాదాపు 390 టీఎంసీల కృష్ణాజలాలు ఆంధ్రప్రదేశ్‌లో ఇతర బేసిన్లకు తరలిపోతున్నాయి. దశాబ్దాలుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, అక్రమాలెన్నో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తాజా విచారణలో స్పష్టమవుతున్నాయి. ఒక నదిలోని నీటిని దాని బేసిన్‌లో ఉన్న ప్రాంతాలకే అందించాలి, అది సహజ న్యాయం. కానీ ఏపీ.. కృష్ణా బేసిన్‌కు అవతల ఉన్న డెల్టాకు కృష్ణా జలాలను వాడుకొంటున్నది. కృష్ణాడెల్టాగా పేర్కొంటున్న 95 శాతం ప్రాంతం నిజానికి కృష్ణా అవతలి బేసిన్లలోనే ఉందని క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా ఏపీ తరఫు సాక్షి అంగీకరించారు. కృష్ణాబేసిన్‌కు అవతల ఉన్న డెల్టానే కృష్ణాబేసిన్‌గా పరిగణించాలని అన్నారు. ఆయన వితండవాదన చూసిన ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ కూడా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.

95 శాతం కృష్ణా ఆయకట్టు కృష్ణాబేసిన్‌కు అవతలనే ఉన్నదనే వాస్తవాన్ని ఏపీ సాక్షి ఒప్పుకొన్నారు. నాగార్జునసాగర్ ఎడమ, కుడికాల్వలతో పాటు కృష్ణా డెల్టా ద్వారా కృష్ణా జలాల్ని బుడమేరు, రామిలేరు, రొంపేరు, గుండ్లకమ్మ వంటి ఇతర బేసిన్లకు తరలిస్తుండటం నిజమేనని ఏపీ సాక్షి తెలిపారు. గాలేరు నగరి సుజల స్రవంతి ద్వారా స్వర్ణముఖి, అరనియార్, కొర్తాలియార్ బేసిన్లకు తరలించడం వాస్తవమేనన్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా పాలార్, పొన్నియార్ నదీ బేసిన్లకు కృష్ణాజలాల తరలింపును ఒప్పుకుంటూనే మిగులు జలాలనే ఇలా వాడుకుంటున్నారని చెప్పారు. కానీ వాస్తవం మరోలా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఈ నీటిని తన హక్కుగా పేర్కొంటూ వినియోగించుకుంటున్నది. గత కొన్నేండ్లుగా లోటు సంవత్సరాల్లోనూ తన కోటా అంటూ హంద్రీనీవా ద్వారా సైతం నీటిని వాడుకుంటున్నది. కృష్ణా ఆయకట్టులో 95 శాతం కృష్ణాబేసిన్‌కు అవతల ఉన్నదంటూనే, దానిని కృష్ణాబేసిన్‌లోనే ఉన్నట్లుగా సాంకేతికంగా పరిగణిస్తోంది. ఈ వాదన విన్న బ్రిజేశ్ సహా పలువురు విస్మయం చెందారు.

కేసీ కెనాల్‌పై 1996లో బరాజ్ పనులు మొదలై 2004 లో పూర్తయినట్లు ఏపీ సాక్షి సుబ్బారావు తెలిపారు. ఆనకట్ట కంటే బరాజ్ వల్ల ప్రయోజనం ఉంటుందని వివరించారు. తుంగభద్ర డ్యాం వల్ల సుంకేసుల ఆనకట్ట దగ్గర జూలైలోనూ వరద రావడం లేదని, కానీ దానిని బరాజ్‌గా మార్చి నీటిని నిల్వచేయడం వల్ల ఆయకట్టుకు సాఫీగా నీరందుతుందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఆనకట్టలను మాత్రం పట్టించుకోలేదు. కేసీ కెనాల్ ద్వారా కృష్ణాజలాలను అదనంగా ఎలా తరలించుకుపోతున్నారు? అసలు సాంకేతిక భూమిక లేకున్నా బచావత్ కేటాయింపులను ఎలా చేసుకున్నారనే అంశాలపై వివరాలను కూడా న్యాయవాది రవీందర్‌రావు రాబట్టారు. కేసీ కెనాల్‌కు పెన్నా, గాలేరు, కుందు, నిప్పులవాగు ఉప నదుల నుంచి ఎంత వరద వస్తుందో లెక్కించకుండానే 39.9 టీఎంసీల బచావత్ కేటాయింపులు జరిగాయనే వాస్తవం స్పష్టమైంది. కేవలం 5.2 టీఎంసీలు ఈ ఉపనదుల నుంచి నీటిలభ్యత వస్తుందన్న వాస్తవాన్ని తెలంగాణ న్యాయవాది నివేదిక ద్వారా బయటపెట్టారు. దాంతో ఈ నివేదికను తాను పరిశీలించిన తర్వాతనే సమాధానమివ్వగలనని ఏపీ సాక్షి అన్నారు.

కేసీ కెనాల్ ఆధునీకరణ ద్వారా 12.75 టీఎంసీల నీటి ఆదా, ఉప నదుల నుంచి 5.2 టీఎంసీల నీటి లభ్యత, 2.6 టీఎంసీల రీజనరేటెడ్ వాటర్ వస్తున్నందున బచావత్ కేటాయించిన 39.9 టీఎంసీల్లో 19.35 టీఎంసీల డిమాండు తగ్గిన విషయాన్ని తెలంగాణ న్యాయవాది బయటపెట్టారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం గురించి ప్రశ్నించగా, ఇది కేవలం వేసవిలో శ్రీశైలం జలాశయంలో తక్కువ నీటిమట్టం ఉన్నపుడు రాయలసీమ తాగునీటి అవసరాల కోసమే వినియోగిస్తారని ఏపీ సాక్షి చెప్పారు. కృష్ణాబోర్డు అనుమతితోనే దీని నుంచి నీటిని తీసుకుంటారన్నారు. కొన్నిరోజుల కిందటే బోర్డు అనుమతి లేకుండా ఏపీ ముచ్చుమర్రి ద్వారా నీటిని తరలించడంపై తెలంగాణ ఫిర్యాదు చేసింది.

పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు తుంగభద్ర హైలెవల్ కెనాల్ నుంచి మాత్రమే నీటిని వాడుకుంటామని ఏపీ సాక్షి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 2005లో ఇచ్చిన జీవో 698, 2006లో జీవో 3ను న్యాయవాది చూపించారు. జీవో 3లో పీఏబీఆర్‌కు తుంగభద్ర నుంచి పది టీఎంసీలను కేటాయించినా అప్పటి ప్రభుత్వం, శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా మరో పది టీఎంసీలను కేటాయించిన విషయాన్ని బయటపెట్టారు. ఇతర బేసిన్లలో 390 టీఎంసీల కృష్ణాజలాలను వినియోగించేందుకు ప్రణాళికలను ఉమ్మడి ఏపీలో రూపొందించిన నివేదికల్ని లాయర్ చూపించగా ఏపీ సాక్షి కాదనలేకపోయారు.

సాగునీటి ప్రాజెక్టుల ఇంజినీరింగ్‌కు సంబంధించి కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఘన్ శ్యాం ఝా సాక్షిగా అఫిడవిట్ సమర్పించేందుకు తెలంగాణ వారం గడువు కోరగా ట్రిబ్యునల్ రెండు వారాల గడువుచ్చింది. అటు ఆంధ్రప్రదేశ్‌కు సాగునీటి ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రొటోకాల్‌పై అఫిడవిట్ దాఖలుకు మూడువారాల గడువిచ్చేందుకు అంగీకరించింది. ఏపీ సాక్షి ఇచ్చిన వివిధ అంశాలపై శుక్రవారం క్రాస్ ఎగ్జామిన్ చేయాలని తెలంగాణ న్యాయవాదికి ట్రిబ్యునల్ సూచించింది.