ప్రాజెక్టుల గేట్లపై నిపుణులతో మంత్రి హరీశ్ సమీక్ష

వివిధ సాగునీటి ప్రాజెక్టుల బ్యారేజీల గేట్ల బిగింపుపై నిపుణులతో మంత్రి హరీశ్ రావు సచివాలయంలో సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ స్పెషల్ సి.ఎస్. ఎస్కే జోషి, ఇరిగేషన్ ఇ.ఎన్.సి. లు మురళీధర్ రావు, నాగేందర్ రావు, దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల గేట్ల ఎరక్షన్ లో ప్రఖ్యాతిగాంచిన ఇంజనీరింగ్ నిపుణుడు కన్నం నాయుడు, గేట్ల డిజైన్స్ నిపుణుడు (రిటైర్డ్ సి.ఇ.) సత్యనారాయణ, పలువురు సి.ఇ.లు, ఎస్.ఇ.లు, అధికారులు పాల్గొన్నారు.

ఆయా ప్రాజెక్టుల ఇరిగేషన్ ఇంజనీర్లతో ఒక వర్క్ షాప్ నిర్వహించాలని గేట్ల నిపుణుడు కన్నంనాయుడును మంత్రి హరీశ్ రావు కోరారు. గేట్ల నిర్మాణం, బిగింపునకు సంబంధించి అన్ని డ్యాముల ఇంజనీర్లకు అవగాహన అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజీలతో పాటు, తుపాకులగూడెం, సదర్ మాట్, చనాకా-కోరాటా బ్యారేజీల గేట్లకు సంబంధించిన తయారీ, వాటి బిగింపుపై సుదీర్ఘంగా సమీక్షించారు. మిడ్ మానేరు గేట్ల తయారీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యిందని, వాటి బిగింపు త్వరలో పూర్తి కానున్నదని మంత్రి చెప్పారు. ఇతర ప్రాజెక్టుల బ్యారేజీలకు అవసరమయ్యే గేట్లు, వాటి మాన్యుఫాక్చరింగ్, రవాణా, నాణ్యత తదితర అంశాలను మంత్రి సమీక్షించారు.

గేట్ల మాన్యుఫాక్చరింగ్, రవాణా, ఎరక్షన్ తదితర వివిధ దశలలో అత్యంత క్షుణ్ణంగా తనిఖీ జరగాలని గతంలో గుజరాత్ లోని సర్దార్ సరోవర్ డ్యాం డిజైన్స్ చీఫ్ గా, సలహాదారుగా సేవలందించిన కన్నం నాయుడు కోరారు. వెల్డింగ్ వంటి మామూలు పని కూడా సవ్యంగా జరగవలసి ఉందన్నారు. ఇంతకు ముందు వెల్డింగ్ వంటి పనులను నిర్లక్ష్యం చేసినందున, వెల్డింగ్ నాసిరకంగా జరగడంతో పలు డ్యాముల గేట్ల సామర్ధ్యం అతి తక్కువ వ్యవధిలో దెబ్బతిన్న విషయాన్ని కన్నంనాయుడు తెలియజేశారు. వెల్డింగ్ పనులు సక్రమంగా జరిగిందీ, లేనిదీ తనిఖీ చేయాలని ఆయన సూచించారు.

వెల్డింగ్ పనుల నాణ్యత పరీక్షకు అధునాతన అల్ట్రా సోనిక్ స్కానింగ్ జరపాలని కన్నంనాయుడు కోరారు. గేట్ల మాన్యుఫాక్చరింగ్ అనంతరం సైట్ కు చేరక ముందే వాటిని తనిఖీ చెయ్యాలని సూచించారు. ఖరారు చేసిన డిజైన్ల ప్రకారం వాటి నాణ్యత ఉన్నదో లేదో నిర్దారించుకోవాలన్నారు. మెకానికల్ గా ఒక్క మిల్లీమీటర్ తేడా వచ్చినా ఇబ్బందులు తలెత్తుతాయని ఆయన తన అనుభవాలను వివరించారు.