ప్రపంచస్థాయి సదస్సులకు కేరాఫ్ హైదరాబాద్

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు కేరాఫ్ గా మారుతున్నది. ఏడాది పొడవునా ప్రపంచస్థాయి సదస్సులకు ఆతిధ్యం ఇచ్చే భాగ్యాన్ని సొంతం చేసుకున్నది. వాతావరణం, ఆతిధ్యం, భద్రత, వసతి, పర్యాటకం, సంస్కృతి, సంప్రదాయాలు తదితర పరిస్థితులు అనువుగా ఉండడంతో ఇక్కడ సదస్సుల నిర్వహణకు నిర్వాహకులు ఆసక్తి చూపుతున్నరు. అన్నిదేశాల నుంచి నగరానికి విమాన రాకపోకలు ఉండడం కూడా అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.

ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు జరిగే ప్రపంచ పారిశ్రామీకవేత్తల సదస్సుకు 150కిపైగా దేశాల నుంచి 1500 మంది పారిశ్రామికవేత్తలు, పెట్టబడిదారులు హాజరుకానున్నారు. ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక పాల్గొంటున్న నేపధ్యంలో హైదరాబాద్ మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నది. డిసెంబర్  లో తెలుగు మహాసభలు రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్ల చేస్తున్నది. డిసెంబర్ 15 నుంచి 19 వరకు హైదరాబాద్ వేదికగా జరిగే ఈ మహాసభలకు ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషా ప్రియులను ఆహ్వానించారు. దాదాపు 10 వేల మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశమున్నది.

జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరుగనున్నది. 10 మంది నోబెల్ బహుమతి గ్రహీతలు, 15 వేల మంది ప్రతినిధులు, దేశంలోని వివిధ యూనివర్సిటీల వైస్  చాన్స్ లర్లు హాజరుకానున్నారు. మరోవైపు ఫిబ్రవరి 14 నుంచి 17వ తేదీ వరకు మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఈఏఐ), ఫిక్కీ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సంయుక్తంగా మైనింగ్ టుడే 2018 పేరుతో సదస్సు నిర్వహించనున్నాయి. గనుల రంగంలో పేరొందిన వివిధ దేశాల ప్రతినిధులు, ప్రైవేట్ సంస్థలను ఈ సదస్సుకు ఆహ్వానిస్తున్నారు.

ఫిబ్రవరిలో రెండు అంతర్జాతీయ సదస్సులు జరుగనున్నాయి. ఫిబ్రవరి 18 నుంచి 21 వరకు వరల్డ్ ఐటీ కాంగ్రెస్ జరుగనుండగా, 22 నుంచి 24 వరకు బయోఏషియా సదస్సు జరుగనున్నది. ఈ రెండు సదస్సులకూ హెచ్ఐసీసీయే వేదిక. నాస్కామ్ ఆధ్వర్యంలో జరిగే వరల్డ్ ఐటీ కాంగ్రెస్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్రముఖ ఐటీ కంపెనీల సీఈవోలు, నాలుగు వేలకు మందికిపైగా ప్రతినిధులు పాల్గొంటారని సమాచారం. పార్మా, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్  కు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. దీనిని మరింతగా పెంచేందుకు బయో ఏషియా పేరుతో నిర్వహిస్తున్న సదస్సుకు ప్రపంచంలోని వివిధ దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు.

పౌరవిమానయాన శాఖ ఆధ్వర్యంలో జరిగే ఏవియేషన్  షోకు హైదరాబాద్ మరోసారి వేదిక కానున్నది. మార్చి 14 నుంచి 18వ తేదీ వరకు బేగంపేట ఎయిర్  పోర్టులో ఈ షో జరుగనున్నది. హైదరాబాద్ లో ఆరోసారి జరిగే ఈ ఏవియేషన్ షోలో 200 కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. ప్రపంచంలోని అత్యాధునిక, ప్రతిష్టాత్మమైన విమానాలను తిలకించే భాగ్యం నగర ప్రజలకు కలుగనున్నది. మూడు అంతర్జాతీయ సదస్సులకు ఆతిథ్యమిస్తూ హైదరాబాద్  షాన్  రోజురోజుకు రెట్టింపు అవుతోంది.