ప్రధాని హైదరాబాద్ టూర్ షెడ్యూల్ ఖరారు

ప్రధానమంత్రి నరేంద్ర మోడి హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారయ్యింది. ఈ నెల 28న మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.45కి హెలికాప్టర్ లో మియాపూర్ మెట్రోరైల్ స్టేషన్ కు బయలుదేరతారు. మధ్యాహ్నం 2.15కు మియాపూర్ లో మెట్రో రైలు పైలాన్ ఆవిష్కరిస్తారు. 2.20కి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై ఆడియో, వీడియో ప్రజెంటేషన్ ను తిలకిస్తారు. మెట్రో రైలు యాప్, బ్రోచర్ ను ఆవిష్కరిస్తారు. 2.30 నుంచి 2.40 గంటల మధ్య మెట్రో రైలులో మియాపూర్ నుంచి కూకట్ పల్లికి,  తిరిగి కూకట్ పల్లి నుంచి మియాపూర్ ప్రయాణిస్తారు. మియాపూర్ మెట్రో డిపో నుంచి గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ షిప్ సమ్మిట్ జరిగే హెచ్ఐసిసి కి  మధ్యాహ్నం 2.55కు హెలికాప్టర్ లో ప్రధాని బయలుదేరతారు. మధ్యాహ్నం 3.35 నుంచి 3.55 గంటల వరకు ఇవాంక ట్రంప్ తో ప్రధాని మోడి సమావేశం అవుతారు. సాయంత్రం 4 గంటలకు గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ షిప్ సదస్సులో పాల్గొంటారు.

ప్రధాని మోడి రాత్రి 7.30కి హెచ్ఐసిసి నుంచి రోడ్డు మార్గంలో ఫలక్ నుమా ప్యాలెస్ కు బయలుదేరతారు. ఇవాంక ట్రంప్ తో పాటు గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ షిప్ సమ్మిట్ కు హాజరయ్యే ప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వం ఫలక్ నుమా ప్యాలెస్ లో ఇచ్చే విందులో పాల్గొంటారు. రాత్రి 10 గంటల వరకు ఫలక్ నుమా ప్యాలెస్ లోనే ఉంటారు. 10.25కు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకొని ఢిల్లీ వెళ్లిపోతారు.