ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఈ నెల 28వ తేదీన హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్ వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటనపై ఉన్నతాధికారులతో సచివాలయంలో ఆయన సమీక్షించారు.

హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం, శంషాబాద్ విమానాశ్రయం, మియాపూర్, హెచ్ .ఐ.సి.సి, ఫలక్ నుమా ప్యాలెస్, గోల్కొండ కోట ప్రాంతాలలో ఏర్పాట్ల పై సీఎస్ ఎస్పీ సింగ్ సమీక్షించారు. బేగంపేట విమానాశ్రయంలో ప్రధాన మంత్రికి ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బేగంపేట విమానాశ్రయంలో ప్రధాన మంత్రికి రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు స్వాగతం పలకనున్నట్లు తెలిపారు.

ఈ నెల 28 న మధ్యాహ్నం ప్రధానమంత్రి మోడి హైదరాబాద్ మెట్రో రైల్ ను ప్రారంభించిన తర్వాత హెచ్.ఐ.సి.సి. లో జరిగే గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ షిప్ సమ్మిట్ లో పాల్గొంటారని ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ తెలిపారు. హెచ్.ఐ.సి.సి. లో జరిగే గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ షిప్ సమ్మిట్ లో అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్ పాల్గొంటారని చెప్పారు. ప్రధానమంత్రి పర్యటించే మార్గంలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. విదేశీ అతిథులు బస చేసే ప్రాంతంలో గట్టి భద్రత కల్పించాలన్నారు. ప్రధానమంత్రి పర్యటించే మెట్రో రైల్ ను అందంగా అలంకరించాలని సూచించారు. మెట్రో రైల్ కార్పొరేషన్ సంబంధిత ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు.

గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ షిప్ సమ్మిట్ కు వచ్చే అతిథుల కోసం శంషాబాద్ విమానాశ్రయం లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఎస్పీ సింగ్ ఆదేశించారు. హెచ్.ఐ.సి.సి లో గ్లోబల్ సమ్మిట్ ను ప్రారంభించే ముందు ప్రధాని అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సందర్శిస్తారని వెల్లడించారు. తర్వాత పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. వివిధ సంస్ధల సి.ఇ.ఓ లతో ద్వైపాక్షి క సమావేశంలో పాల్గొంటారని అన్నారు. ఈ సమావేశాలలో అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్ పాల్గొంటారని వివరించారు.

ఫలక్ నుమా ప్యాలెస్ లో ప్రధానమంత్రి ఇచ్చే విందుకు అతిథులను హెచ్.ఐ.సి.సి నుండి తీసుకొని వెళ్లడానికి పకడ్బందీ ప్రణాళికను రూపొందించాలని సీఎస్ ఎస్పీ సింగ్ ఆదేశించారు. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ షిప్ సమ్మిట్ అతిథులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 29న గోల్కొండ కోటలో ఇచ్చే విందుకు అన్ని ఏరాట్లు చేయాలని ఆధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో డి.జి.పి. మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రాజేశ్వర్ తివారి, అజయ్ మిశ్రా, రాజ్ భవన్ ముఖ్యకార్యదర్శి హరిప్రీత్ సింగ్, ముఖ్యకార్యదర్శులు అధర్ సిన్హా,  సునీల్ శర్మ, జయేష్ రంజన్, కార్యదర్శులు నవీన్ మిట్టల్, బి.వెంకటేశం, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగిత రాణా, రంగా రెడ్డి జిల్లా కలెక్టర్  రఘునందన్ రావు, జి.హెచ్.యం.సి కమిషనర్ జనార్దన్ రెడ్డి, అడిషనల్ డి.జి.పి. అంజనీ కుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రావు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్  సందీప్ శాండిల్య, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, ఫైర్ సర్వీస్ డి.జి. రాజీవ్ రతన్, మెట్రో రైల్ యం.డి. ఎన్.వి.ఎస్. రెడ్డి, ప్రోటోకాల్ డిప్యూటి సెక్రటరీ అరవిందర్ సింగ్, రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ విష్ణువర్ధన్ రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ యం.డి. క్రిస్టినా జడ్ చోంగ్తు తదితరులు పాల్గొన్నారు.